అధిక జనాభా నుంచి జనాభా క్షీణత వైపుగా భారత్? భవిష్యత్ పై ప్రభావమెంత?

దేశవ్యాప్తంగా ఈ రేటు ఒకేలా లేదు. దక్షిణ భారత రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ ఇప్పటికే చాలా తక్కువగా ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంది.

Update: 2026-09-16 02:30 GMT

ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో అపరిమిత వృద్ధి రేటుతో వార్తల్లో నిలుస్తున్న భారతదేశం ఇప్పుడు ఒక చారిత్రాత్మక జనాభా మార్పును ఎదుర్కొంటోంది. దేశంలో సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) తొలిసారిగా రీప్లేస్‌మెంట్ స్థాయి కంటే దిగువకు పడిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రీప్లేస్‌మెంట్ స్థాయి అంటే ఏమిటి?

ఒక దేశంలో జనాభా దీర్ఘకాలంలో స్థిరంగా తగ్గకుండా, పెరగకుండా కొనసాగాలంటే ఒక మహిళకు సగటున 2.1 మంది పిల్లలు జన్మించాలి. దీనిని 'రీప్లేస్‌మెంట్ ఫెర్టిలిటీ రేట్' అంటారు. అయితే ఇటీవల అందిన గణాంకాల ప్రకారం భారత సగటు టీఎఫ్ఆర్ ప్రస్తుతం 1.9కి పడిపోయింది. అంటే భవిష్యత్తులో రాబోయే తరాలు మునుపటి తరాలను పూర్తిస్థాయిలో భర్తీ చేయలేవు.

సంతానోత్పత్తి రేటు తగ్గడానికి కారణాలు ఏంటి?

పట్టణీకరణ విద్య పెరగడం.. మహిళల్లో అక్షరాస్యత పెరగడం, ఉన్నత విద్యార్హతలు సాధించడం... మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణించడం వల్ల వివాహ వయసు పెరగడం... పిల్లల పోషణ, నాణ్యమైన విద్య, వైద్యం కోసం అయ్యే ఖర్చులు అధికమవ్వడంతో జంటలు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితమవ్వడం. కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజల్లో పెరిగిన చైతన్యం వల్ల జనాభారేటు పడిపోతోంది.

తక్షణ ప్రమాదం లేకపోయినా.. సుదీర్ఘ ప్రభావం తప్పదు

ఫెర్టిలిటీ రేట్ తగ్గినా దేశంలో వెంటనే జనాభా సంక్షోభం రాదు. కారణం భారత్‌లో ప్రస్తుతం 'యువ జనాభా' చాలా ఎక్కువగా ఉంది. రాబోయే కొన్నేళ్ల పాటు పనిచేసే వయసు ఉన్న జనాభా పుష్కలంగా అందుబాటులో ఉంటుంది. సరైన నైపుణ్యాలు, ఉపాధి కల్పిస్తే ఇది ఆర్థిక వ్యవస్థకు అద్భుతమైన చోదక శక్తిగా మారుతుంది. అయితే దీర్ఘకాలంలో ఈ ధోరణి వల్ల కొన్ని ప్రధాన సవాళ్లు ఎదురవుతాయి. జననాలు తగ్గి, సగటు ఆయుర్దాయం పెరగడం వల్ల దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. పెన్షన్లు, ఆరోగ్య రక్షణ , సామాజిక భద్రతపై ప్రభుత్వాల ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. కాలక్రమేణా పనివయసు జనాభా వాటా తగ్గి, ఆర్థిక ఉత్పత్తి మందగించే ప్రమాదం ఉంది.

ప్రాంతీయ వ్యత్యాసాలు.. ఆందోళన

దేశవ్యాప్తంగా ఈ రేటు ఒకేలా లేదు. దక్షిణ భారత రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ ఇప్పటికే చాలా తక్కువగా ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంది. ఈ అసమానతల వల్ల భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన, కేంద్ర నిధుల పంపిణీలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి నాయకులు జనాభా సమతుల్యత గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించడంలో సాధించిన విజయం.. భవిష్యత్తులో వారికి రాజకీయ, ఆర్థిక ప్రతికూలతగా మారకూడదని, కుటుంబాలు సంతానోత్పత్తిపై సానుకూలంగా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఒకప్పుడు జనాభా నియంత్రణే లక్ష్యంగా పనిచేసిన భారత్.. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా 'జనాభా సమతుల్యత'ను కాపాడుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News