అక్కడ వేమిరెడ్డి తోనే వైసీపీ ఢీ కొట్టాలి !
వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభ సభ్యుడు కూడా అయి వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఒక బలమైన నేతగా ఉంటూ వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని 2024 ఎన్నికల ముందు వైసీపీ పోగోట్టుకుంది.
వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభ సభ్యుడు కూడా అయి వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఒక బలమైన నేతగా ఉంటూ వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని 2024 ఎన్నికల ముందు వైసీపీ పోగోట్టుకుంది. ఆయన కోరినట్లుగా ఎంపీ ఎమ్మెల్యే టికెట్లను ఇచ్చేందుకు అధినాయకత్వం తిరస్కరించడంతో గోల్డెన్ చాన్స్ ని టీడీపీ అందుకుంది. కాంగ్రెస్ జమానా నుంచి కూడా నెల్లూరు జిల్లాలో టీడీపీకి రాజకీయ పట్టు తక్కువ. అలాంటిది వైసీపీ గత రెండు ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచిన జిల్లాను 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి సంపూర్ణంగా సమర్పించేసుకుంది అంటే దానికి ఆ పార్టీ అధినాయకత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే కారణం అని అంటున్నారు. వేమిరెడ్డి లాంటి బలమైన నేతలను వదులుకు నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎంతగా నష్టపోయింది అన్నది ఫలితాలు రుజువు చేశాయి.
ఒంటి చేత్తో నడిపిస్తూ :
ఇక టీడీపీలో చేరిన వేమిరెడ్డి నెల్లూరు నుంచి లోక్ సభ సభ్యుడు అయ్యారు. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి కోవూరు నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇపుడు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి హవా నడుస్తోంది. దాంతో నెల్లూరు మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కూటమి విజయానికి వేమిరెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయన చుట్టూనే ఆశావహులు అంతా ప్రదక్షిణం చేస్తున్నారు. కార్పోరేషన్ ఎన్నికలు అంటే భారీ బడ్జెట్ వ్యవహారం అందుకే వేమిరెడ్డి మీదనే మొత్తం బాధ్యతలను కూడా అధినాయకత్వం పెడుతోంది అని అంటున్నారు. దాంతో పాటుగా వేమిరెడ్డి తన అనుచరులను మేయర్ పీఠం మీద కూర్చోబెట్టాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు.
వైసీపీకి కష్టమే :
వేమిరెడ్డి అంగబలం అర్ధ బలం తట్టుకుని నిలిచి గెలవడం అన్నది వైసీపీకి ఇపుడున్న పరిస్థితుల్లో కష్టమే అని అంటున్నారు. పైగా కూటమికి నెల్లూరు జిల్లాలో ఏకంగా మునిసిపల్ మంత్రి నారాయణ ఉన్నారు. అలాగే నెల్లూరు రూరల్ జిల్లా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి మాస్ లీడర్ ఉన్నారు. ఇలా నెల్లూరు జిల్లాలో ఇపుడు కూటమి అత్యంత పటిష్టంగా ఉంది. అంతా కలసి కూర్చూంటే నూటికి నూరు శాతం స్ట్రైక్ రేటు కూటమికే దక్కుతుందని అంటున్నారు. మరి ఇంతలా పకడ్బందీగా రాజకీయం చేస్తున్న కూటమి నుంచి ప్రత్యేకించి వేమిరెడ్డిని ధీటుగా ఎదుర్కోవడం వైసీపీకి అయ్యే పనేనా అని అంతా చర్చిస్తున్నారు.
నల్లేరు మీద నడక మాదిరి :
వైసీపీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ అయ్యారు కానీ ఆయన మొత్తం కార్పోరేషన్ ఎన్నికలను ఒంటి చేత్తో నడిపించగలరా అని ఆలోచిస్తున్నారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ నల్లపురెడ్డి ఇద్దరూ కూడా వేమిరెడ్డి మీద విమర్శలు చేస్తూ మరింతగా ఆయన్ని రెచ్చగొడుతున్నారని అంటున్నారు. దీంతో వేమిరెడ్డి కార్పోరేషన్ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకోవాలని నిర్ణయించారని అంటున్నారు. ఒక విధంగా చూస్తే కూటమికి ఈ ఎన్నికలు నల్లేరు మీద నడక మాదిరిగా ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో మాటలకే తప్ప చేతల దాకా కధను వైసీపీ నేతలు ఎంత మేరకు నడుపుతారు అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.