హితుడు...స్నేహితుడు...ఏడీ ఎక్కడ ?
మహా భారతంలోకి వెళ్తే హితుడా అని పదే పదే తనలో మరో ప్రాణం అయిన కర్ణుడు గురించి సుయోధనుడు తలచుకుంటూ ఉంటాడు. ఆ ఇద్దరి స్నేహం ఆదర్శప్రాయం.
మహా భారతంలోకి వెళ్తే హితుడా అని పదే పదే తనలో మరో ప్రాణం అయిన కర్ణుడు గురించి సుయోధనుడు తలచుకుంటూ ఉంటాడు. ఆ ఇద్దరి స్నేహం ఆదర్శప్రాయం. సుయోధనుడి కోసం ఎంతదాకా నైనా అని అంటాడు కర్ణుడు. ఆఖరుకు తన వద్దకు వచ్చి శ్రీకృష్ణుడు పాండవ పక్షం వహిస్తే రాజ్య భోగాలు అన్నీ లభిస్తాయని చెప్పినా స్నేహితుడికే కట్టుబడి ఉంటానని చెబుతాడు. చివరికి స్నేహితుడి కోసం ప్రాణం విడిస్తాడు. అందుకే హితుడు అయినా స్నేహితుడు అయినా కర్ణుడే. అలాగే మరో కధ పురాణాలలో ప్రసిద్ధిగా ఉంటుంది. అది కుచేలుడు శ్రీక్రిష్ణుడులది. కుచేలుడి పేదరికం కృష్ణుడి రాచరికం ఈ పవిత్ర స్నేహానికి ఎక్కడా అడ్డు రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కధలు ఉన్నాయి.
ఆపద కంటే ముందే :
స్నేహితుడు అన్న వాడు ఆపద కంటే ముందే వచ్చి అండగా ఉంటాడు. తన దోస్త్ కి ఏమైనా జరిగితే అన్న దాని కంటే జరగకుండానే జాగ్రత్తపడతాడు. స్నేహితుల మధ్య తారతమ్యాలు ఉండవు, అరమరికలు అంతకంటే ఉండవు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఏ బంధంలోనూ చెప్పుకోలేని విషయాలు విప్పుకోలేని చిక్కు ముళ్ళు స్నేహితుల దగ్గర మాత్రమే పరిష్కారం అవుతాయి. అందుకే రక్త బంధం కంటే గొప్పది స్నేహం అని అంటారు. దీనికి ఏ బంధంగా చూడాలో సరైన నిర్వచనం కూడా ఇప్పటివరకూ ఎవరూ చెప్పలేకపోయారు అంటేనే స్నేహం ఎంతటి పవిత్ర బంధమో అర్ధం అవుతోంది కదా.
ఇంతకీ ఉన్నారా మరి :
అయితే స్నేహితులు ఉన్నారు అంటారు, కానీ గొప్ప స్నేహితులు ఉన్నారా ఎవరికైనా ఈ రోజుల్లో అంటే జవాబు కోసం తడుము కోవాల్సిందే. ఎందుకంటే ఈ రోజులలో అన్నీ కృత్రిమ బంధాలే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. స్నేహం కూడా కలుషితం అయిపోయింది. ఆర్థికంగా ఆదుకోకపోతే స్నేహితుడే కాదు, అలాగే ఇవాళ స్నేహితుడు రేపటికి ఉండడం లేదు, స్కూల్ డేస్ లో స్నేహాన్ని జీవిత కాలం వరకూ కంటిన్యూ చేసిన వారు ఎంత మందో వేళ్ళ మీద లెక్క బెట్టవచ్చు. అవసరాలకు స్నేహాలు అన్నట్లుగా తయారు అయ్యాయి. అన్ని బంధాలు ఆర్థిక బంధాలే అన్న దానికి వర్తమాన స్నేహం కూడా అతీతం కాదని కూడా ప్రస్తుతం నిరూపణ అవుతోంది.
ఒంటరిగానే ఉంటూ :
ఇక స్నేహితులు ఉన్న వారు అయితే అలాంటి పరిస్థితి. అదే సమయంలో స్నేహాలు, స్నేహితులు ఉన్నారా అంటే దానికి కూడా జవాబు లేదు. ఎందుకంటే మనిషి ప్రస్తుతం ఒంటరిగా అయిపోతున్నాడు. ఎక్కడ చూసినా తనలో తానే అయిపోతున్నాడు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు సర్వస్వం అదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎవరితోనూ మాట్లాడే తీరిక కానీ ఓపిక కానీ అసలు ఉండటం లేదు, గతంలో చూస్తే ప్రతీ వారికీ గంపెడు మంది స్నేహితులు ఉండేవారు. ఇపుడు ఒక్కరు కూడా పక్కన నిలవని నేపథ్యం ఉంది. దీనికంతటికీ కారణం మనిషి సమాజానికి బంధాలకు దూరంగా జరుగుతున్న ఒక విచిత్ర వాతావరణం నెలకొనడమే అని అంటున్నారు. మంచి పుస్తకం మంచి స్నేహితుడు ఉంటే చాలు నీ జీవితం బాగుంటుంది అని పెద్దలు చెబుతారు. కానీ ఇపుడు ఆ రెండూ లేవు. మరి మంచి జీవితం ఉందా అంటే ఇపుడు అనుభవిస్తున్న భౌతిక సుఖాలు మంచికే అనుకుంటోంది ఒక తరం.
భావోద్వేగాలు లేకుండానే :
వర్తమానంలో భావోద్వేగాలకు పెద్దగా స్థానం ఉండడం లేదు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మనసు అన్నది ఎక్కడో లోపలి పొరలలో ఉందో లేదో కూడా తెలియని స్థితి అంటున్నారు. మనసుతో కలిసే స్నేహాలు ఎపుడూ శాశ్వతమే కానీ ఆ మనసుని సైతం మొద్దుబార్చే బిజీ జీవితం, ఒత్తిడి జీవితం అలాగే సోషల్ మీడియా యుగం నడుస్తున్న వేళ నిజమైన స్నేహం ఎండమావిగా మారుతోంది. మనసుకి నచ్చే స్నేహం కోసం నిజంగా ఎవరైనా అనుకున్నా వెతికి వేసారిపోవాల్సిందే అన్న వాతావరణం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఒక్క మాట ఇక్కడ మననం చేసుకోవాలి. మనిషి అంటే మనసు ఉన్న వాడే. మనసు ఉంటే బంధాలు భావోద్వేగాలు కూడా ఉంటాయి. అవి లేని నాడు రోబోకు మనిషికీ పెద్దగా తేడా అయితే ఉండదు.