అనిల్ అంబానీకి ఎంతటి పరిస్థితి వచ్చింది?

ఒకప్పుడు దేశంలోనే అగ్రగామి పారిశ్రామికవేత్తగా వెలుగువెలిగి ఆ తర్వాత వరుస రుణ సంక్షోభాలతో వ్యాపార సామ్రాజ్యాన్ని కోల్పోయిన అనిల్ అంబానీకి ఈ పరిణామం కోలుకోలేని దెబ్బగా మారింది.

Update: 2026-08-02 12:30 GMT

ఒకప్పుడు దేశంలోనే అగ్రగామి పారిశ్రామికవేత్తగా వెలుగువెలిగి ఆ తర్వాత వరుస రుణ సంక్షోభాలతో వ్యాపార సామ్రాజ్యాన్ని కోల్పోయిన అనిల్ అంబానీకి ఈ పరిణామం కోలుకోలేని దెబ్బగా మారింది. గతంలోనే అనేక బ్యాంకింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలను ఎదుర్కొంటున్న ఆయనపై, ఇప్పుడు నేరుగా కోట్ల మంది ఉద్యోగుల పీఎఫ్ సొమ్ముకు సంబంధించిన కేసు నమోదు కావడం ఆయన వ్యాపార ప్రతిష్టను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసింది. అయితే ఈ ఆరోపణలను ఆయన ప్రతినిధులు తీవ్రంగా ఖండించినప్పటికీ ప్రభుత్వ విచారణ సంస్థలు ముమ్మర దర్యాప్తుకు సిద్ధమవ్వడంతో అనిల్ అంబానీ భవిష్యత్తు ఇప్పుడు అత్యంత కీలక మలుపు తిరిగింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీతో పాటు ఆయనకు చెందిన రిలయన్స్ క్యాపిటల్ సంస్థ.. పలువురు ప్రభుత్వ అధికారులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిధులను రిలయన్స్ క్యాపిటల్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ₹1,816 కోట్ల మేర భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందనే ప్రధాన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అసలు వ్యవహారం ఏమిటి?

సమాచారం ప్రకారం.. ఉద్యోగుల భవిష్యనిధికి సంబంధించిన సొమ్మును సురక్షితమైన మార్గాల్లో డిపాజిట్ చేసి వచ్చే రాబడి ద్వారా చందాదారులకు లాభాలు అందించాలనే ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ గతంలో రిలయన్స్ క్యాపిటల్ జారీ చేసిన బాండ్లలో దాదాపు ₹2,500 కోట్ల భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది. అయితే తదనంతర పరిణామాల్లో రిలయన్స్ క్యాపిటల్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.

దీంతో బాండ్ల కాలపరిమితి ముగిసినప్పటికీ ఆ సంస్థ చెల్లించాల్సిన అసలు, వడ్డీ బకాయిలను ఈపీఎఫ్ఓ కు తిరిగి చెల్లించలేకపోయింది. లెక్కల ప్రకారం అసలు, వడ్డీ కలిపి మొత్తం ₹1,816 కోట్ల మేర ఈపీఎఫ్ఓ తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర కార్మిక శాఖ, సమగ్ర పరిశీలన అనంతరం లీగల్ చర్యలకు దిగి సీబీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.

ఈ కేసు నమోదుతో దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ ప్రధానంగా ఈపీఎఫ్ఓ అధికారులు రిలయన్స్ క్యాపిటల్‌లో పెట్టుబడులు పెట్టే సమయంలో సరైన నిబంధనలు పాటించారా లేదా? నిధుల కేటాయింపులో ఏవైనా అక్రమాలు జరిగాయా? నిబంధనలను పక్కనపెట్టి ప్రభుత్వ అధికారులు ఎవరికైనా ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారా? నిధుల వినియోగంలో వైఫల్యం, పెట్టుబడి ఆమోదం తెలిపిన కమిటీ పాత్రపై లోతైన విచారణ జరగనుంది.

రిలయన్స్ గ్రూప్ ఖండన

సీబీఐ కేసు నమోదు చేయడంపై రిలయన్స్ గ్రూప్ స్పందించింది. తమపై వచ్చిన ఆరోపణలను సంస్థ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో అనిల్ అంబానీకి ఎటువంటి ప్రత్యక్ష ప్రమేయం లేదని వెల్లడించారు. 2022 మార్చిలోనే ఆయన రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు లేదా సంస్థ ఆర్థిక లోటుపాట్లకు ఆయనను బాధ్యుడిని చేయడం సమంజసం కాదని వివరణ ఇచ్చారు.

ఈ కేసు ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. సీబీఐ సేకరించే ఆధారాలు, తనిఖీల్లో బయటపడే విషయాల ప్రాతిపదికన తదుపరి చట్టపరమైన చర్యలు ఆధారపడి ఉంటాయి. కోట్లాది మంది ఉద్యోగుల కష్టార్జితమైన పీఎఫ్ నిధులను ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రభుత్వ సంస్థలు పాటించాల్సిన జాగ్రత్తలపై ఈ కేసు ఒక మైలురాయిగా మారే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. దర్యాప్తు పూర్తికాక ముందే ఎవరినీ దోషులుగా నిర్ధారించలేమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News