'కిల్లి' రాజకీయాలు సమాప్తం.. !
కృపారాణి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి రాజకీయాలు ముగిశాయా? ఇక, ఆమె హవా పూర్తిగా ముగిసిపో యినట్టేనా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పటికీ.. ఆమెకు పెద్దగా గుర్తింపు లేదన్న విషయం తెలిసిందే. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ ఏపీ చీఫ్ షర్మిల ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో తనకు అవకాశం ఇవ్వాలని కిల్లి కోరారు. కానీ, షర్మిల ఆమెను పక్కన పెట్టడంతో కృపారాణి మౌనంగా ఉండిపోయారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కృపారాణి ఒకప్పుడు(కాంగ్రెస్ హయాంలో) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఒక ముఖ్యమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. కానీ, తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే.. ఆమె మైనస్ అయిపోయారన్న వాదన బలంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, వైసీపీలో ఆశించిన ప్రాధాన్యత దక్కలేదని భావించినకిల్లి.. టికెట్ల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందనే తీవ్ర అసంతృప్తితో 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిపోయారు.
కృపారాణి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.కానీ, ఘోరంగా పరాజయం పాలయ్యారు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున గెలుపొంది, మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్ర సమాచార, టెలీకమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినా.. జిల్లాపై ఆమె తనదైన ముద్ర వేయలేకపోయారు.
శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన అగ్ర నాయకురాలిగా ఆమెకు మంచి పేరున్నా.. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు ప్రత్యేకంగా నిధులు తీసుకురాలేక పోవడం.. తర్వాత పరిణామాల్లో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో కిల్లి రాజకీయాలు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి. దీనికితోడు.. టీడీపీ నేతలతో ఉన్న విభేదాలు కూడా ఆమెకు మరింత మైనస్ అయ్యాయి.
నిజానికి గత ఎన్నికలకు ముందు టీడీపీ ఆఫర్ ఇచ్చిందనే టాక్ ఉంది. కానీ, అనూహ్యంగా ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లడంతో కేడర్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. ఇక, ఇప్పుడు కిల్లి రాజకీయాలు పూర్తిగా ముగిసినట్టేనని అంటున్నారు. ఒకవేళ ఆమె వైసీపీలోకి తిరిగి వచ్చే ప్రయత్నాలు చేస్తే.. అప్పుడు ఏమైనా పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. .