మూడు జిల్లాలూ రెండు కుటుంబాల చేతుల్లో...వైసీపీలో ఇదే చర్చ ?

వైసీపీకి ఉత్తరాంధ్ర జిల్లాలో బాగానే ఓట్ షేర్ ఉంది. అది కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓటింగ్. బీసీలతో పాటు ఎస్సీలు, ఎస్టీలు ఇక్కడ ఎక్కువగా ఉంటారు, వీరంతా కాంగ్రెస్ నుంచి వైసీపీకి టర్న్ అయ్యారు.

Update: 2026-09-20 03:00 GMT

వైసీపీకి ఉత్తరాంధ్ర జిల్లాలో బాగానే ఓట్ షేర్ ఉంది. అది కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓటింగ్. బీసీలతో పాటు ఎస్సీలు, ఎస్టీలు ఇక్కడ ఎక్కువగా ఉంటారు, వీరంతా కాంగ్రెస్ నుంచి వైసీపీకి టర్న్ అయ్యారు. చిత్రమేంటి అంటే కాంగ్రెస్ లో దిగ్గజ నేతలుగా పనిచేసిన నాయకులు కూడా వైసీపీనే ఎంచుకున్నారు. వైసీపీ కూడా వారినే ప్రోత్సహిస్తోంది. ఆ విధంగా చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీ ఎక్కువగా సీనియర్ నాయకుల మీద కొన్ని పెద్ద కుటుంబాల మీద ఆధారపడుతోంది అని అంటున్నారు. వైసీపీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. కొత్త వారు కూడా పార్టీలో ఉన్నారు. అయితే ఎందుకనో వైసీపీ కొన్ని కుటుంబాలకే పార్టీ బాధ్యతలను అప్పగించి నెట్టుకుని వస్తోంది అని అంటున్నారు.

బొత్స చేతిలోకి :

ఇక ఉత్తరాంధ్రాలో మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. అందులో రెండు జిల్లాలు అయిన విజయనగరం, విశాఖ జిల్లాలు సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అప్పగించారు అని అంటున్నారు. బొత్స కుటుంబం ఎటూ విజయనగరం జిల్లాను రాజకీయంగా శాసిస్తోంది. 2024 ఎన్నికల ముందు నుంచి విశాఖ జిల్లాను కూడా కేటాయించారు అని అంటున్నారు. ఇక విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవికి కూడా బొత్సకు ఇవ్వడం ద్వారా ఆయనకు ఆ జిల్లా బాధ్యతలను అప్పగించారు అని చర్చకు వస్తోంది. ఇక 2024 ఎన్నికల్లో బొత్స సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేశారు. అలా విశాఖలో కూడా బొత్స రాజకీయ పట్టు పెరిగింది అని అంటున్నారు.

కుమార్తెకు భీమిలీ :

ఇపుడు లేటెస్ట్ గా చూస్తే బొత్స కుమార్తె అనూషకు భీమునిపట్నం అసెంబ్లీ సీటుని అప్పగించారు. ఇక్కడ వైసీపీ ఇంచార్జిగా నిన్నటిదాకా పనిచేసింది బొత్స మేనల్లుడు అయిన చిన్న శ్రీను. ఆయన టీడీపీలోకి వెళ్ళిపోవడంతో ఆ సీటుని తిరిగి బొత్స కుటుంబానికే అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు కూడా బొత్స ఫ్యామిలీకే ఇస్తారని చర్చ అయితే సాగుతోంది. ఈ విధంగా చూస్తే అటు విజయనగరం ఇటు విశాఖలోనూ బొత్స పలుకుబడి గట్టిగానే వైసీపీలో సాగుతోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలో ఎంతో మంది నాయకులు ఉన్నారు అన్న మాట వినిపిస్తోంది. ఇక భీమిలీ విషయం తీసుకుంటే స్థానిక నాయకత్వానికే ఇంచార్జి పదవి ఇవ్వమని డిమాండ్ అయితే పార్టీలో వచ్చింది. కానీ హైకమాండ్ మాత్రం బొత్స ఫ్యామిలీకే ఓటేసింది అని అంటున్నారు.

సిక్కోలు వారికేనా :

ఇక మరో వైపు చూస్తే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో వైసీపీ ధర్మాన కుటుంబం మీద ఎక్కువగా ఆధారపడుతోంది అని అంటున్నారు. ఈ జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలు ఉన్నా కూడా ఒకే సామాజిక వర్గం పెత్తనం వైసీపీలో సాగుతోంది అన్నది సొంత పార్టీలోనే ప్రత్యర్ధుల మాట. తమ్మినేని కుటుంబం అయితే బాహాటంగానే ధర్మాన కుటుంబం మీద ఇప్పటికే విమర్శలు చేస్తోంది. ధర్మాన ఫ్యామిలీ వల్లనే తాను పార్టీకి దూరం అయ్యానని సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భావిస్తున్నారు అని అంటున్నారు. కాళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని దువ్వాడలతో పాటు ఇతర నేతలు కూడా వైసీపీలో జరుగుతున్న పరిణామాల పట్ల గుస్సా అవుతున్నారని అంటున్నారు. దీంతో వైసీపీ కొన్ని కుటుంబాల చేతిలోనే నడుస్తోంది అన్న అభిప్రాయం బలంగా జనంలోకి వెళ్లడం మంచి పరిణామం కాదని అంటున్నారు. దీని మీద అధినాయకత్వం ఏ విధమైన ఆలొచనలు చేస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News