ఆల్ టైం రికార్డ్ సృష్టించిన ఫోన్.. ఏకంగా 25 కోట్లకు పైగా అమ్మకాలు!
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొబైల్ కమ్యూనికేషన్‌ను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ఘనత ఈ ఫోన్‌దే.
ఈనాడు చేతిలో రంగురంగుల స్మార్ట్‌ఫోన్లు, 5G ఇంటర్నెట్, AI టెక్నాలజీ ఎన్నో ఉండవచ్చు. కానీ మొబైల్ ప్రపంచంలో అసలైన రికార్డు సృష్టించిన ఒక సాధారణ కీప్యాడ్ ఫోన్ ఉందంటే నమ్ముతారా? అదే నోకియా 1100. నేటి ఐఫోన్, శాంసంగ్ లాంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్లు కూడా ఇప్పటికీ దాటలేని ఒక అరుదైన మైలురాయిని ఈ చిన్న ఫోన్ సాధించింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఈ లెజెండరీ ఫోన్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన నోకియా 1100:
2003లో మార్కెట్లోకి విడుదలైన నోకియా 1100 మొబైల్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 25 కోట్లకు (250 మిలియన్లు) పైగా యూనిట్లు అమ్ముడై చరిత్ర సృష్టించింది. ఇక మానవ చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ పరికరంగా ఇది నిలవడం విశేషం.
నోకియా మైలురాయికి గుర్తుగా..:
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొబైల్ కమ్యూనికేషన్‌ను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ఘనత ఈ ఫోన్‌దే. 2005లో నైజీరియాలో ఒక కస్టమర్ నోకియా 1100 ఫోన్‌ను కొనుగోలు చేయడంతో, నోకియా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తన 100వ కోటి (1 బిలియన్) ఫోన్ అమ్మకాల మైలురాయిని చేరుకోవడం మరో విశేషం.
ఇటుక లాంటి మన్నిక, తిరుగులేని బ్యాటరీ:
ఈ ఫోన్‌కు ఉన్న ప్రధాన బలం దాని మన్నిక. ఎంత ఎత్తు నుంచి కింద పడినా చెక్కుచెదరని బాడీతో "ఇటుక లాంటి ఫోన్" గా పేరు తెచ్చుకుంది. ఇక దీని బ్యాటరీ లైఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. రోజులు, వారాల తరబడి రీఛార్జ్ చేయాల్సిన అవసరమే ఉండేది కాదు.
ఫ్లాష్ లైట్, స్నేక్ గేమ్ మ్యాజిక్:
సాధారణ కాల్స్, SMSలు మాత్రమే ఉండే ఈ ఫోన్‌లో దుమ్ము పడకుండా సిలికాన్ కీప్యాడ్ ఉండేది. చీకటిలో వాడుకోవడానికి పైన అమర్చిన టాచ్ లైట్ ఆ రోజుల్లో పెద్ద వరంగా మారేది. ఇక దీనితో పాటు అందరికీ ఇష్టమైన ఐకానిక్ 'స్నేక్ గేమ్ ఈ ఫోన్‌కు ఉన్న ప్రత్యేక ఆకర్షణ.
ఎన్ని అధునాతన కెమెరాలు, టెక్నాలజీలు వచ్చినా నోకియా 1100 సృష్టించిన సేల్స్ రికార్డును ఏ స్మార్ట్‌ఫోన్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఇక సామాన్యుడి చేతికి కమ్యూనికేషన్ అందించిన ఈ చిన్న ఫోన్, సాంకేతిక ప్రపంచంలో ఎప్పటికీ చెరిగిపోని ఒక మధురమైన జ్ఞాపకం.