టీడీపీ ఫైర్ బ్రాండ్స్ అందరూ సైలెన్స్.. ఎందుకంటారు?
ముఖ్యంగా పార్టీ ఫైర్ బ్రాండ్స్ గా ముద్రపడిన నేతలు వివాదాలు దూరంగా ఉండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అధికార తెలుగుదేశం పార్టీ అంతర్గత రాజకీయ వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కొద్ది రోజులుగా టీడీపీ నేతల వైఖరిని గమనిస్తే స్పష్టమైన మార్పు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ ఫైర్ బ్రాండ్స్ గా ముద్రపడిన నేతలు వివాదాలు దూరంగా ఉండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత రెండేళ్లుగా వివిధ రకాల వివాదాలతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన నేతలు ఇప్పుడు అనూహ్యంగా వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం తమ నియోజకవర్గాలకే పరిమితం అయిపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు ఎమ్మెల్యేల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా ఉండేదని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇందులో ప్రధానంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ రఘు రామరాజు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతొపాటు మరికొందరు పేర్లు ఎక్కువగా వార్తల్లో ఉండేవి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి అయితే పార్టీ గెలిచిన తొలిరోజే ప్రత్యర్థుల ఇళ్లపై దూకుడు చూపించడమే కాకుండా, సొంత పార్టీ కేడర్ తోనూ గొడవలు పెట్టుకుని అధిష్టానంతో చీవాట్లు తినేవరకు వచ్చిందని అంటున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయడమే కాకుండా, ఇద్దరూ రోడ్డెక్కిన పరిస్థితి పార్టీకి తీవ్ర తలనొప్పులు తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. దీంతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై సస్పెన్షన్ వేటు వేయాలని పార్టీ క్రమశిక్షణ సంఘం సిఫార్సు చేసేవరకు వచ్చింది. అయితే ఈ విషయంలో అధినేత చంద్రబాబు కాస్త సమయమనం పాటించడంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సస్పెన్షన్ సిఫార్సుల తర్వాత ఎమ్మెల్యే కొలికపూడి కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నారని అంటున్నారు. ఇదేసమయంలో అంతకుముందు రోజూ ఏదో ఒక వివాదంలో ఇరుకున్న పరిస్థితి మారిందని చెబుతున్నారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘు రామరాజు కూడా కాస్త దూకుడు తగ్గించినట్లు ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
ఏమైందో కానీ ఇటీవల రఘు రామరాజు వ్యవహారశైలిలో పూర్తిగా మార్పు వచ్చిందని టీడీపీ నేతల అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. తనపై కస్టోడియల్ టార్చర్ కేసులో చర్యలు లేవని ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడటమే కాకుండా అనేక విషయాల్లో పార్టీ లైన్ ను అతిక్రమించి రఘు రామ మాట్లాడేవారని విమర్శలు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. ఇక ఆకివీడు రామాలయం విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రఘురామ కూడా కొన్ని రోజులుగా నోటికి పని తగ్గించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా దూకుడు తగ్గించడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కాపునేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్లిన బొండా ఉమా అనుకోకుండా వివాదంలో చిక్కుకోగా, ఆయన తీరును ప్రశ్నించిన వారిపై ఘాటు వ్యాఖ్యలు చేసి రచ్చ రచ్చ చేశారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్న తర్వాత బొండా తీరులో అనూహ్య మార్పు వచ్చిందని అంటున్నారు. రాముడు మంచి బాలుడు అన్నటైపులో అధిష్టానానికి వీరవిధేయుడిగా ప్రచారం చేసుకోవడంలో బొండా తలమునలకై పనిచేస్తుండటంపై కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైఖరిలో కూడా కొంత మార్పు కనిపిస్తోందని అంటున్నారు. ఇంతకముందులా తన సహజసిద్ధ వైఖరికి భిన్నంగా అఖిలప్రియ దూకుడు తగ్గించడంపై కార్యకర్తల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నలుగురే కాకుండా టీడీపీలో ఎంతో మంది నేతలు వివాదాలకు దూరంగా ఉండేలా తీరు మార్చుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యేల్లో వచ్చిన మార్పునకు అధిష్టానం తీసుకున్న చర్యలు ఏంటి అన్నదే కార్యకర్తల్లో హాట్ టాపిక్ అవుతోంది.