చెవిరెడ్డి ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే.. !

చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబ రాజకీయం ప్రస్తుతం తీవ్ర ఒడిదొడుకులు, సవాళ్లతో కూడుకున్న ఒక హోరాహోరి పోరాటంగా సాగుతోంది.

Update: 2026-09-19 18:30 GMT

చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబ రాజకీయం ప్రస్తుతం తీవ్ర ఒడిదొడుకులు, సవాళ్లతో కూడుకున్న ఒక హోరాహోరి పోరాటంగా సాగుతోంది. గతంలో నియోజకవర్గంపై తిరుగులేని పట్టు సాధించిన చెవిరెడ్డి కుటుంబం, ప్రస్తుతం అధికార మార్పిడి తర్వాత తీవ్రమైన రాజకీయ, చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రస్తుత చంద్రగిరి రాజకీయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిల పరిస్థితి దారుణంగా ఉంద‌ని వైసీపీ లోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. 2024 ఎన్నికల్లో తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చంద్రగిరి నుంచి బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పులివర్తి నాని చేతిలో మోహిత్ రెడ్డి ఓడిపోయారు. అయినప్పటికీ, ప్రస్తుతం మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేసేందుకు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ, కేసులు, అరెస్టుల పర్వంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

వైసీపీ హయాంలో అత్యంత దూకుడుగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ప్రభుత్వం మారిన తర్వాత లిక్కర్ స్కామ్, పోక్సో చట్టం కింద పలు కేసులను ఎదుర్కొన్నారు. కొంతకాలం విజయవాడ సెంట్రల్ జైలులో ఉండి ఈ ఏడాది జనవరిలో విడుదలయ్యారు. అయితే.. ఆస్తుల జప్తు వ్య‌వ‌హారంతో ఇప్పుడు చెవిరెడ్డి ఇబ్బందులు ప‌డుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల నుండి కమీషన్లు తీసుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సిట్ విచారణ జరిపింది.

ఈ దర్యాప్తు ఆధారంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి సహా వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను జప్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక‌, ఎమ్మెల్యే పులివర్తి నానితో భూ వివాదాలు - సవాళ్లు కూడా చెవిరెడ్డి ఫ్యామిలీని ఇర‌కాటంలోకి నెట్టాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చెవిరెడ్డి కుటుంబం మధ్య రాజకీయ వైరం మునుపటికంటే పెరిగింది. ముఖ్యంగా తిరుపతి సమీపంలోని అవిలాల భూ వివాదం(రూ. 100 కోట్ల విలువ‌) ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో స్థానిక ఎన్నిక‌ల విష‌యంపై ఫోక‌స్ పెట్టేందుకు చెవిరెడ్డి ఫ్యామిలీ ఆస‌క్తిగా లేద‌ని అంటున్నారు. ఒక‌వేళ దృష్టి పెట్టినా.. టీడీపీ దూకుడు ముందు.. చెవిరెడ్డి ఫ్యామిలీ పెద్ద‌గా స‌క్సెస్ అయ్యే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

Tags:    

Similar News