అమెరికా గుమ్మం ముందు మరో భారీ అడ్డంకి.. భారత ఐటీ నిపుణుల కలలకు కొత్త పరీక్ష!

కొత్త హెచ్-1బీ వీసాలపై విధించిన $100,000 (సుమారు రూ. 83 లక్షలకు పైగా) భారీ ప్రాసెస్సింగ్ ఫీజు నిబంధనను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

Update: 2026-09-19 18:00 GMT

అమెరికాలో ఉద్యోగం, డాలర్ జీతం, మెరుగైన భవిష్యత్తు సాధించాలనే భారతీయ ఐటీ నిపుణుల డ్రీమ్‌కు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి విఘాతం కలిగించింది. కొత్త హెచ్-1బీ వీసాలపై విధించిన $100,000 (సుమారు రూ. 83 లక్షలకు పైగా) భారీ ప్రాసెస్సింగ్ ఫీజు నిబంధనను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. 2026 సెప్టెంబర్ 18న వెలువడిన ఈ నిర్ణయంతో ఈ కఠిన ఆంక్షలు 2027 సెప్టెంబర్ 21 వరకు అమలులో ఉండనున్నాయి.

కంపెనీలపై భారీ ఆర్థిక భారం

ఈ చెల్లింపు నిబంధన సాధారణ ఫీజు పెంపు మాత్రమే కాదు. అమెరికా వెలుపల ఉన్న ఒక విదేశీ నిపుణుడిని హెచ్-1బీ వీసా ద్వారా కంపెనీలోకి తీసుకోవాలంటే ఒక్కో కేసుకు సదరు సంస్థ లక్ష డాలర్ల అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. దీనివల్ల భారతదేశం నుండి నేరుగా టెక్ నిపుణులను లేదా ఫ్రెషర్లను అమెరికాకు డిప్యుటేషన్‌పై తీసుకెళ్లే ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీల వ్యయం విపరీతంగా పెరగనుంది.

అమెరికా స్థానిక ఉద్యోగాలను పరిరక్షించడం.. హెచ్1బీ ప్రోగ్రామ్‌లో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ సమర్థించుకుంది. 2025లో ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రముఖ ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు ఏకంగా 92 శాతం మేర తగ్గిపోయాయని.. ఇప్పటివరకు 700కి పైగా పిటిషన్లకు ఈ లక్ష డాలర్ల ఫీజు వసూలైందని అమెరికా ప్రభుత్వం గణాంకాలను వెల్లడించింది.

ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి ఉపశమనం?

ఈ ఆంక్షల పట్ల ఐటీ వర్గాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రధానంగా అమెరికా వెలుపల ఉదాహరణకు భారతదేశంలో ఉండి.. కొత్తగా హెచ్-1బీ వీసా ద్వారా అమెరికా వెళ్లాలనుకునే నిపుణులపైనే ఈ $100,000 భారం పడుతుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటూ హెచ్-1బీ హోదా కలిగిన ఉద్యోగులకు, వీసా రెన్యూవల్స్ చేసుకునే వారికి ఈ ఫీజు వర్తించదు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుని, ఎఫ్-1 వీసా నుండి వర్క్ స్టేటస్‌కి మారే అంతర్జాతీయ విద్యార్థులకు కూడా ఈ నిర్దిష్ట ప్రవేశ ఫీజు నుండి మినహాయింపు ఉంది.

లేఆఫ్స్ చేసిన కంపెనీలపై ప్రత్యేక నిఘా

కొత్త ఆదేశాల ప్రకారం.. గతంలో అమెరికన్ ఉద్యోగులను తొలగించిన లేదా రాబోయే రోజుల్లో లేఆఫ్స్ చేయాలని భావిస్తున్న సంస్థలు హెచ్-1బీ నిపుణులను స్పాన్సర్ చేస్తుంటే సదరు పిటిషన్లను అధికారులు మరింత కఠినంగా పరిశీలిస్తారు. స్థానిక ఉద్యోగుల తొలగింపు తర్వాత విదేశీ నిపుణులను తక్కువ వేతనానికి నియమించుకోకుండా నిరోధించడానికే ఈ కఠిన పరిశీలన నిబంధన తెచ్చారు.

న్యాయస్థానాల్లో పోరాటం.. భవిష్యత్తు ఏంటి?

ప్రస్తుతం ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లింపు నిబంధనపై అమెరికా అప్పీల్స్ కోర్టులో విస్తృత విచారణ జరుగుతోంది. ఫెడరల్ కోర్టు గతంలో ఈ నిర్ణయాన్ని ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడంతో న్యాయపోరాటం కొనసాగుతోంది. కోర్టులు ఇచ్చే తుది తీర్పుపైనే ఈ వీసా భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఒకప్పుడు ప్రతిభ, నైపుణ్యం ఉంటే అమెరికా డ్రీమ్ నెరవేరేది. కానీ మారుతున్న వీసా నిబంధనలు.. విపరీతమైన ఖర్చుల కారణంగా ఇప్పుడు ప్రతిభతో పాటు కంపెనీలు భరించే ఆర్థిక శక్తే ప్రామాణికంగా మారుతోంది. భారతీయ ఐటీ నిపుణుల 'అమెరికన్ డ్రీమ్' పూర్తిగా ముగియనప్పటికీ ఆ తీరానికి చేరుకునే ప్రయాణం మాత్రం మునుపటి కంటే అత్యంత ఖరీదైనదిగా.. క్లిష్టమైనదిగా మారింది.

Tags:    

Similar News