కరవు కోరల్లో ఏపీ విలవిల...తొంబై శాతం దుర్భిక్షం !

ఇదిలా ఉంటే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై కూటమి ప్రభుత్వం నిశితంగా పరిశీలన చేస్తోంది.

Update: 2026-09-20 03:42 GMT

ఏపీలో ఎన్నడూ చూడని ఇబ్బందికరమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. కరవు అంటే ఏమిటో చరిత్రలో మొదటిసారి ఆంధ్ర రాష్ట్రం చూస్తోంది. ఆంధ్రాకు అన్న పూర్ణ అన్న పేరు ఉంది. దేశానికి రైస్ బౌల్ అని అంటారు. కానీ ఈసారి చాలా జిల్లాలలో ఖరీఫ్ సీజన్ లో విత్తనం వేయలేని దుస్థితి నెలకొంది. అంతే కాదు చాలా చోట్ల వేసిన పంటకు నీరు అందక సాగు సాగని నేపథ్యం ఉంది. ఏపీ ఇంతలా కరవుతో విలవిలాడుతున్న వాతావరణం ఎపుడూ లేదని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏపీలో కరవు విలయతాండవం చేస్తోంది అనడానికి రాష్ట్రం మొత్తంలో అత్యధిక మండలాలలో కరవు చాయలు కనిపించడమే అని అంటున్నారు.

ఏకంగా అన్ని మండలాల్లో :

ఏపీలో చూస్తే 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 513 మండలాల్లో కరువు నెలకొందని అధికారుల నివేదిక వెల్లడిస్తోంది. వీటిలో 268 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటే మరో 245 మండలాలలో ఒక మాదిరిగా ఉంది. దీంతో కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలనను వ్యవసాయ శాఖ చేపట్టాలని నిర్ణయించింది. ప్రతీ జిల్లాలలో ఆయా జిల్లాల కలెక్టర్ల మార్గదర్శకత్వంలో క్షేత్ర స్థాయి బృందాలు పంట నష్టం దిగుబడి నష్టాన్ని పరిశీలిస్తాయి. అనంతరం వ్యవసాయ శాఖ క్షేత్ర పరిశీలన నివేదికను ఆ బృందం జిల్లా కలెక్టర్లకు సమర్పిస్తుంది. ఇలా వచ్చిన కరువు ప్రతిపాదనలను రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖకు జిల్లా కలెక్టర్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మొత్తం నివేదికలు కరవుకు సంబంధించిన ప్రతిపాదనలు సెప్టెంబర్ 29న వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో పరిశీలిస్తారు.

త్వరలో కరువు మండలాల ప్రకటన :

ఇదిలా ఉంటే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై కూటమి ప్రభుత్వం నిశితంగా పరిశీలన చేస్తోంది. ఈ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. అంతే కాదు రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ప్రతీ నెలా కేంద్రానికి నివేదికలు పంపించాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఇప్పటికే ఖరీఫ్ సీజన్ లో వేసిన పంటకు ఎక్కడా నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచిస్తోంది. ఇక మీదట సూక్ష్మ సేద్యం ప్రకృతి సాగుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది.

ఉద్యాన పంటలపై ఎల్‌నినో ప్రభావం :

ఏపీలో ఉద్యాన పంటల పైన కూడా ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉందని అంటున్నారు. దీంతో రాష్ట్రంలోని 21 జిల్లాలలో ఒక వేయి 357 ఆర్ఎస్ కేల పరిధిలో ఉన్న పంటలు హై రిస్క్ కేటగిరీలో ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఎల్‌నినోతో 17 వేల 916 హెక్టార్లలోని నారింజ బత్తాయి మామిడి ఎర్ర మిరప ఉల్లి కూరగాయల పంటలు ప్రభావితం కానున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణాన్ని కాపాడేందుకు మైక్రో ఇరిగేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News