వెల్లువలా దరఖాస్తులు....కొత్త పెన్షన్లు ఎంతమందికి ?

ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు దాదాపుగా 13 లక్ష్లా 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వివిధ కేటగిరీలలో సామాజిక పెన్షన్లు అందిస్తున్న నేపథ్యం ఉంది.

Update: 2026-09-20 03:42 GMT

ఏపీలో కొత్త పెన్షన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ స్టార్ట్ అవుతుంది. దాని కోసం ఇప్పటికే దరఖాస్తుల సేకరణ ఘట్టం పూర్తి అయింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 18 వరకూ దరఖాస్తులను సచివాలయంలో స్వీకరించారు. కేవలం పది రోజుల తేడాలో వెల్లువలా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. సగటున రోజుకు లక్షా ముప్పై వేల వంతున ఈ దరఖాస్తులు వచ్చినట్లుగా లెక్క చెబుతోంది. ఇలా కొత్త పెన్షన్ల కోసం కోటి ఆశలు పెట్టుకుని అర్హులైన లబ్దిదారులు అంతా ఎదురు చూస్తున్నారు. సమయం తక్కువగా ఉన్నా ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం ఒక విధంగా మంచి విషయంగా ఉన్నా ఇలా లక్షల్లో వచ్చిన దరఖాస్తుల నుంచి ఎంత మందికి కొత్త పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేయనుంది అన్నదే చర్చగా ఉందిపుడు.

పెన్షన్లకు 13.40 లక్షల దరఖాస్తులు :

ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు దాదాపుగా 13 లక్ష్లా 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వివిధ కేటగిరీలలో సామాజిక పెన్షన్లు అందిస్తున్న నేపథ్యం ఉంది. అందులో ఎక్కువగా వృద్ధాప్య పెన్షన్ల కోసమే ఆరు లక్షల 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని అంటున్నారు. ఆ తరువాత వితంతు పెన్షన్లకు దాదాపుగా మూడు లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. దివ్యాంగుల పెన్షన్ కోసం ఒక లక్షా 84 వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు అని అంటున్నారు. ఇలా వచ్చిన ఈ మొత్తం లక్షల దరఖాస్తులను ఈ నెల 24 నాటికి పరిశీలిసంచి ఆ కసరత్తు పూర్తి చేయనున్నారు. ఇక ఇందులో నుండి మొదటి దశ కింద అక్టోబర్ 1న అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. దాంతో ఇన్ని లక్షల మందిలో తొలి దశలో ఎంత మందికి పెన్షన్ భాగ్యం దక్కుతుంది అన్నది ఇపుడు చర్చగా ఉంది.

మొత్తం పెన్షన్లు చూస్తే :

ఇదిలా ఉంటే దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక మొత్తంతో పాటు ఎక్కువ మందికి సామాజిక పెన్షన్లు ఇస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానిదే. ప్రస్తుతం ఏపీలో సామాజిక పింఛన్ల వివరాలు చూస్తే రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల 92 వేల 396 మంది లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఇందులో వృద్ధులు వితంతువులు గీత కార్మికులు చేనేతలు మత్స్యకారులు కేటగిరీగా ఉన్నారు. వృద్ధులకు నెలకు నాలుగు వేల రూపాయలు, సాధారణ దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు, తీవ్రమైన వైకల్యం ఉన్నవారు అలాగే, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పది వేల రూపాయా నుండి పదిహేను వేల రూపాయల దాకా సామాజిక పెన్షన్లు అందిస్తున్నారు.

అతి పెద్ద బడ్జెట్ గానే :

ఇక చూస్తే ఏపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల కోసం ప్రతి ఏటా దాదాపుగా 33 వేల 600 కోట్ల రూపాయల వరకూ భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల మొత్తాన్ని పెంచడంతో ఈ వ్యయం దేశంలోనే అత్యధిక తలస సామాజిక పెన్షన్ గా రికార్డులకు ఎక్కింది. ఇక చూసెత ఈ ఆర్ధిక సంవత్సరం 2026-27 బడ్జెట్‌లో సామాజిక పెన్షన్లకు 27 వేల 719 కోట్లు రూపాయలను కేటాయించింది. అయితే లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఇది అదనపు బడ్జెట్ విడుదలతో ఏడాదికి 33 వేల కోట్లకు పైగా చేరుతుందని చెబుతున్నారు.

మరో 8 వేల కోట్లకు పైగా బడ్జెట్ :

ఇపుడు ఈ బడ్జెట్ కి అదనంగా కొత్త పెన్షన్లు ఏకంగా 13.40 లక్షలు చేరితే కనుక ఖర్చు అమాంతం మరో 8 వేల కోట్లకు పైగా బడ్జెట్ లో వచ్చి కలుస్తుంది అని అంటున్నారు. అంటే ఏపీలో సామాజిక పెన్ష్న్ల కోసం ప్రతీ ఏటా ఇక మీదట 40 వేల కోట్ల పై చిలుకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే కొత్త పెన్షన్ల కోసం 13 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినా తొలి విడతగా మూడు లక్షలకే అనుమతిస్తారు అని అంటున్నారు. దీని కోసం అయినా కూడా రెండు వేల కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ అవసరం అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News