తర్వాతి వికెట్ కడియం శ్రీహరేనా ?

స్పీకర్ హౌస్ బయట చర్యలు తన పరిధిలోకి రావు, అసెంబ్లీలోని ప్రవర్తన మాత్రమే చూడాలి అని చెప్పడం రాజ్యాంగ విరుద్దం అని, న్యాయపరంగా వక్రీకరణ, తప్పుడు విధానం అని పేర్కొంది.

Update: 2026-09-20 05:43 GMT

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయాన్ని కొట్టి వేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఆయన తర్వాత అనర్హత వేటు పడేది ఎవరి మీద అన్న చర్చ మొదలయింది. ఫిరాయింపుల విషయంలో స్పీకర్ ఎవరూ పార్టీ మారలేదని తీర్పు ఇచ్చారు. అయితే దానం నాగేందర్ పార్టీ మారిన అనంతరం కాంగ్రెస్ బీ ఫారం మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు వేటు వేసింది.

ఈ సంధర్భంగా హైకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పును కఠినంగా తప్పుపట్టింది. స్పీకర్ హౌస్ బయట చర్యలు తన పరిధిలోకి రావు, అసెంబ్లీలోని ప్రవర్తన మాత్రమే చూడాలి అని చెప్పడం రాజ్యాంగ విరుద్దం అని, న్యాయపరంగా వక్రీకరణ, తప్పుడు విధానం అని పేర్కొంది. ఇది ఆర్టికల్ 191(2) మరియు 10వ షెడ్యూల్ (పారా 2) లోని రాజ్యాంగ ఆదేశాలను ఉల్లంఘిచడమేని చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీ.ఎం. మొహియుద్దీన్ ధర్మాసనం పేర్కొంది.

ఈ పరిస్థితులలో పార్టీ ఫిరాయించిన మిగిలిన ఎనిమిది మందిలో తర్వాత వికెట్ ఎవరు అంటే నేరుగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కనిపిస్తున్నాడు. 2023లో బీఆర్ఎస్ నుండి గెలిచిన కడియం శ్రీహరి ఆ వెంటనే పార్టీ ఫిరాయించారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి మీద బీఆర్ఎస్ వేసిన పిటీషన్ త్వరలోనే విచారణకు రానున్నట్లు తెలుస్తుంది.

ఈ కేసులో ప్రధానంగా 2024 ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన కూతురు కడియం కావ్య పోటీ చేయడం, అందులో నామినేషన్ పత్రాల మీద కడియం శ్రీహరి సంతకాలు చేయడమే కాకుండా కాంగ్రెస్ కండువాలు కప్పుకుని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కోరిన అంశాలు ప్రధానంగా విచారణకు రానున్నట్లు తెలుస్తుంది. కాబట్టి దానం తరువాత కడియం శ్రీహరి మీద వేటు తప్పదని అంటున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తాజాగా హైకోర్టు ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టింది. దానం, కడియంతో పాటు మరో ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించడమే కాకుండా, సహాయ మంత్రి హోదా ఇవ్వడం ఆయనకు ఇబ్బందికరంగా మారుతుంది అని అంటున్నారు. మొత్తానికి ఈ అనర్హత అంశాలు ఎప్పుడు తేలుతాయి అన్నది ఆసక్తికర అంశంగా మారింది.

Tags:    

Similar News