హార్దిక్ పాండ్యా.. ఆటతో పాటే అనేక విమర్శలు-వివాదాలు
గురువారం ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్లో చివరి ఓవర్లో లాంగాన్ బౌండరీ లైన్ నుంచి అతడు విసిరిన భారీ త్రో జాకబ్ బెతెల్ రనౌట్ కు దారితీసింది.;
టీమ్ఇండియా పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా... మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటాడు. గురువారం ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్లో చివరి ఓవర్లో లాంగాన్ బౌండరీ లైన్ నుంచి అతడు విసిరిన భారీ త్రో జాకబ్ బెతెల్ రనౌట్ కు దారితీసింది. ఇక దీనికిముందు అతడు బ్యాట్ తోనూ అతడు ప్రభావం చూపాడు. 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. బౌలింగ్ లో నాలుగు ఓవర్లు వేసి 38 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. జట్టులో 4 ఓవర్ల కోటా వేసి బుమ్రా (33) తర్వాత తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ ఇతడే కావడం గమనార్హం. ప్రతిభ కంటే కష్టపడే తత్వంతోనే హార్దిక్ ఈ స్థాయికి వచ్చాడనేది సందేహం లేదు. అయితే, ఇప్పుడు అతడి చుట్టూ విమర్శలు రేగుతున్నాయి. ముఖ్యంగా సెమీస్ చివర్లో మంచి ఊపులో ఉన్న శివమ్ దూబె రనౌట్ కు కారణం కావడం, అక్షర్ పటేల్ వంటి హిట్టర్ ఉన్నప్పటికీ అతడికి స్ట్రయికింగ్ ఇవ్వకపోవడం, ఐదో బంతికి లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ కావడాన్ని అభిమానులు ఎత్తిచూపుతున్నారు. బ్యాటింగ్ లో నాలుగు పరుగులు చేసి, బౌలింగ్ లో వికెట్లు తీయడంతో సరిపోయింది కానీ.. లేదంటే సెమీఫైనల్లో ఓటమి ఎదురైతే అందరూ హార్దిక్ ను తప్పబట్టేవారే. ఇప్పుడు మరో అంశం బయటకు వచ్చింది. అతడి విషయంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాస్త ఆగ్రహంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇంతకూ ఏం జరిగింది?
హార్దిక్.. కుమారుడు పుట్టాక నటాషాతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడు మహికా అనే యువతితో డేటింగ్ చేస్తున్నాడు. టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లకూ ఆమె వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ నిబంధనల ప్రకారం.. మెగా టోర్నీల సమయంలో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా భార్యలు, స్నేహితురాళ్ల విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ, హార్దిక్ మాత్రం మహికాతో సమయం గడుపుతున్నాడని సమాచారం. తాజాగా గంభీర్ కు మహికాను పరిచయం చేసిన సందర్భంలో అతడి స్పందన వైరల్ అవుతోంది.
క్రమశిక్షణ తప్పాడా?
మహికాను వెంటేసుకుని తిరగడంలో హార్దిక్ క్రమశిక్షణ తప్పాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా ఆల్ రౌండర్ ప్రవర్తన ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అందుకే, మహికాను పరిచయం చేసిన సమయంలో గంభీర్ ఆమెను మర్యాదగా పలకరించినా ముక్తసరిగా మాట్లాడాడని చెబుతున్నారు. కొంత అసహనంగానూ కనిపించినట్లు పేర్కొంటున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఊహాగానాలకు తెరతీసింది.
ఈ ఒక్క మ్యాచ్ కు కంట్రోల్ చేసుకో బాస్..
హార్దిక్ విలువైన ఆటగాడు అనడంలో సందేహం లేదు. జట్టు కోసం 200 శాతం కష్టపడే అతడి అంకితభావాన్ని ఏమాత్రం సందేహించలేం. పైగా ఇప్పుడు ఫైనల్ ముంగిట ఇదంతా అవసరమా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా ఈ ఒక్క మ్యాచ్ కు కంట్రోల్ చేసుకో బాస్.. అని అభిమానులు వేడుకుంటున్నారు. ఇదే సమయంలో గంభీర్-హార్దిక్ మధ్య కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. నెట్స్ లో హార్దిక్ కొట్టే భారీ షాట్లను గంభీర్ ఎంజాయ్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నారు.