నడిరోడ్డుపై మహిళా ఉద్యోగిని అడ్డుకొని దాడి.. చీర చింపేశారు
దీంతో ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాల్ని సేకరించారు. చివరకు నాగరాజమ్మ రెండు ఉద్యోగాల్ని చేస్తున్నది వాస్తవమేనని తేల్చారు.;
పట్టపగలు.. నడి రోడ్డు మీద ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి మీద పలువురు ఒక గుంపుగా వచ్చి అడ్డుకోవటం.. ఆమెతో వాదనకు దిగటం.. ఆ పై దాడి చేయటం.. పిడిగుద్దులు గుద్దుతూ.. జుట్టు పట్టి లాగటమే కాదు.. చీర చించేసిన అరాచకం చోటు చేసుకుంది. ఇదంతా చదివిన తర్వాత ఇదెక్కడో జరిగిందని భావిస్తే తప్పులో కాలేసినట్లే. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
ఇంతకూ సదరు మహిళా ప్రభుత్వ ఉద్యోగి చేసిన తప్పేంటో తెలుసా? బాధ్యతగా రిపోర్టును పంపటమే. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి.. వాస్తవాలతో రిపోర్టు ఇవ్వటమే ఆమె చేసిన పాపం. దీంతో కన్నెర్ర చేసి.. ఆమెను నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టిన వైనం విమర్శలకు తావిస్తోంది. అసలేం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ -3 మహిళా సమాఖ్యకు సంఘమిత్రగా.. అదే ప్రాంతంలో ఆశా కార్యకర్తగా నాగరాజమ్మ పదిహేనేళ్లుగా పని చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఆమె రెండు ఉద్యోగాలు చేస్తూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మోసం చేస్తున్న వైనంపై జిల్లా కలెక్టర్ కు కొందరు కంప్లైంట్ చేశారు. దీంతో.. ఈ అంశంపై నివేదిక పంపాలని గుర్రంకొండ ఏపీఎం రజినికి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాల్ని సేకరించారు. చివరకు నాగరాజమ్మ రెండు ఉద్యోగాల్ని చేస్తున్నది వాస్తవమేనని తేల్చారు. పీహెచ్ సీ వైద్యులు సైతం ఇదే అంశంపై రిపోర్టు ఇచ్చారు. దీంతో ఏపీఎం రజనిపై నాగరాజమ్మ, ఆమె మద్దతుదారులు కక్ష కట్టారు. తలారివాండ్లపల్లె.. మజ్జిగవారి పల్లెలకు చెందిన కొందరు వైసీపీ నేతలు.. మహిళలు నాగరాజమ్మ ఆధ్వర్యంలో మండల మహిళా సమాఖ్య ఆఫీసుకు వచ్చారు. ఏపీఎంను అక్కడకు రావాలని కోరారు. విధి నిర్వహణలో భాగంగా ఎంపీడీవో ఆఫీసుకు వచ్చిన రజినిని రోడ్డు మీదనే అడ్డుకున్నారు.
ఆమెతో మాట్లాడుతూ ఉండగా.. పలువురు మహిళలు ఆమెపై పిడిగుద్దులు గుద్దుతూ.. చీర చించేశారు. జుట్టు పట్టుకొని లాగుతూ ఇష్టారాజ్యంగా దాడికి పాల్పడ్డారు.బూతులు తిడుతూ.. విక్రతంగా వ్యవహరిస్తూ ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే.. వారు ఘటనా స్థలానికి చేరుకునేసరికి పోలీసులు పారిపోయారు. ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చేతిలో అధికారంలో లేని వేళలో వైసీపీ నేతలు మహిళా ఉద్యోగి పట్ల వ్యవహరించిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.