ఎందుకీ 'అసంతృప్తి'.. వాస్తవాలు ఇవిగో.. !
అయితే.. అసలు చంద్రబాబు చెబుతున్న అసంతృప్తికి.. క్షేత్రస్థాయిలో ప్రజల నాడికి మధ్య తేడా ఉంద ని అంటున్నారు పరిశీలకులు.;
ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదంటూ.. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆ వ్యాఖ్యలు చంద్రబాబు అనకుండా వేరేవారు అని ఉంటే .. ఇంత పెద్ద ప్రభావం ఉండేది కాదు. కానీ, చంద్రబాబు అధికారులను హెచ్చరించే క్రమంలో అసంతృప్తిపై మాట్లాడుతూ.. తనపై కూడా ప్రజల్లో సంతృప్తి పెద్దగా లేదన్నారు. సరే.. దీనిని సరిచేసుకునేందుకు మూడున్నర సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి.. ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది లేదు.
అయితే.. అసలు చంద్రబాబు చెబుతున్న అసంతృప్తికి.. క్షేత్రస్థాయిలో ప్రజల నాడికి మధ్య తేడా ఉందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో 4.8 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీరిలో సర్వేలో పాల్గొన్నది కేవలం 70-80 లక్షల మంది మాత్రమే. ఈ పరంగా చూసుకుంటే.. ప్రజల నాడిని పూర్తిగా పట్టుకోలేదు. సరే.. అసలు అసంతృప్తి విషయానికి వస్తే.. కీలమైన నాలుగు రంగాల్లో ప్రజల్లో అసంతృప్తి ఉందన్నది వాస్తవం. వీటిని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తే.. సర్కారుకు మేలు జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
1) రెవెన్యూ విభాగం: రైతుల నుంచి సాధారణ ప్రజల వరకు కూడా.. భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వైసీపీ సర్కారు ఎత్తేసిన `22-ఏ` భూముల వ్యవహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించింది. దీనికి కారణాలు ఏవైనా అవకాశం ఉన్నచోట ఖచ్చితంగా.. ఈ భూములను రైతులకు, ప్రజలకు రిజిస్ట్రేషన్ చేస్తే.. అసంతృప్తి తగ్గుతుంది. దీనిపై దృష్టి పెట్టాలి.
2) పోలీసింగ్: సామాన్యులకు పోలీసులు అందుబాటులో లేకపోతున్నారన్న విమర్శ.. గత ఏడాది కాలంగా వినిపిస్తోంది. వీఐపీలకు భద్రత, వివిధ కేసులకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృం దాలు.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పోలీసులు బిజీ అయ్యారు. దీంతో సామాన్యులకు స్టేషన్ల లో పనులు కావడం లేదు. అసలు సామాన్యులను పట్టించుకుంటున్నవారు కూడా కనిపించడం లేదు. దీనిని మార్చాల్సిన అవసరం ఉంది.
3) అవినీతి: గత ఏడాదిన్నర కాలంలో ఏ పని చేయించుకోవాలన్నా.. పైసలు ముట్ట జెప్పాల్సి వస్తోంది. చివరకు టీడీపీ సానుభూతి పరులకు కూడా పనులు జరగడం లేదన్నది వాస్తవం. రెవెన్యూ నుంచి అన్ని విభాగాల్లోనూ విస్తృతంగా అవినీతి జడలు విచ్చుకుంది. దీనిని అరికట్టే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం తరఫున పనులు సులభంగా అవుతాయన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే.. ఆటోమేటిక్‌గానే వారిలో సంతృప్తి పెరుగుతుంది. దీనిపై సర్కారు ప్రత్యేక శ్రద్థ తీసుకోవాలి.
4) ఎవరికి చెప్పాలి: ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. చెప్పుకొనేందుకు ఎవరూ కనిపించని పరిస్థితి ఏర్పడు తోంది. దీనికి ఉదాహరణ.. ఎక్కడెక్కడ నుంచో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వస్తున్న ప్రజలే. ఎక్కడ అనంతపురం.. ఎక్కడ మంగళగిరి.. రోజంతా ప్రయాణం చేసి.. ఇక్కడకు వచ్చి.. అర్జీలు ఇస్తున్నారంటే.. స్థానికంగా... ఎమ్మెల్యేలు, అధికారులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. ఇది కాదా అసంతృప్తి పెంచేందుకు దోహదపడుతున్న అంశం. ఒక్క అనంతే కాదు.. శ్రీకాకుళం, విజయనగరం నుంచి కూడా.. ప్రజలు మంగళగిరికి వచ్చి.. తమ గోడు చెప్పుకొంటున్నారు. ఈ పరిస్థితిని మారిస్తే.. ప్రజల్లో అసంతృప్తి తగ్గుతుంది. అలా కాకుండా.. పైపైనే చర్యలు తీసుకుంటే ప్రయోజనం శూన్యం అంటున్నారుపరిశీలకులు.