ఫోన్‌ట్యాపింగ్ ఎఫెక్ట్: ప్రణీత్ రావుకు డిమోషన్!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు పెనుకుదుపునకు గురి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.;
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు పెనుకుదుపునకు గురి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత డీఎస్పీ ర్యాంకు అధికారి .. ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ.. బుధవారం ఉదయమే ఉత్తర్వులు వెలువరిం చింది. దీంతో ఆయనకు డీఎస్పీ ర్యాంకు పోయి.. గతంలో చేసిన సీఐ స్థానానికే పరిమితం కానున్నారు.
బీఆర్ ఎస్ పార్ట అధికారంలో ఉన్నసమయంలో ప్రణీత్ రావును సీఐ నుంచి డీఎస్పీ స్థాయికి ప్రమోట్ చేశారు. అయితే.. ఎంతో మంది సీనియర్లు ఉండగా.. ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డీఎస్పీ ర్యాంకు కల్పించడం.. ప్రత్యేకంగాఫైలును సిద్ధం చేయడం వివాదానికి దారితీసింది. ఇటీవల ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించినప్పుడు.. ఈ విషయాన్ని ఆరా తీశారు. ఎంతో మంది సీనియర్లు ఉండగా.. వారిని కాదని ప్రణీత్ రావుకు డీఎస్పీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
ఈ విషయంలో కేసీఆర్ తన తప్పులేదని.. పోలీసు ఉన్నతాధికారులు చేసిన రికమండేషన్లనే తాను ఆమోదించానని.. ఆయనపై ప్రత్యేక శ్రద్ధ చూపలేదని వివరణ ఇచ్చారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే సిట్ అధికారుల సూచనల మేరకు.. డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావును.. సీఐగా డిమోట్ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును గతంలోనే సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
2007 సబ్ ఇన్ స్పెక్టర్ బ్యాచ్‌కు చెందిన ప్రణీత్ రావు.. 2018లో సీఐగా ప్రమోట్ అయ్యారు. అనంతరం.. స్వల్ప వ్యవధిలోనే ఆయనకు బీఆర్ ఎస్ ప్రభుత్వం డీఎస్పీగా ప్రమోషన్ ఇచ్చింది. దీని వెనుక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన కీలకంగా వ్యవహరించేందుకు అవకాశం కల్పించారన్న వాదన వినిపించింది. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన తర్వాత.. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఇక, ఇప్పుడు డీఎస్పీ స్థాయి నుంచి సీఐకి స్థాయికి మార్చింది.