జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు నోరు తెరవాల్సిందేనా ?
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన మన ఊరు మాటా మంతీ కార్యక్రమంలో భాగంగా తన సొంత పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల మీద గట్టిగానే ఫైర్ అయ్యారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన మన ఊరు మాటా మంతీ కార్యక్రమంలో భాగంగా తన సొంత పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల మీద గట్టిగానే ఫైర్ అయ్యారు. పవన్ ఫైర్ అవడం వెనక రీజన్ ఉంది అని అంటున్నారు. ఆయన మాట్లడుతూ ఒక రౌడీ ఎలిమెంట్ చనిపోతే తనను మధ్యలోకి లాగుతున్నారు అని మండిపడ్డారు. ఆ రౌడీ ఎలిమెంట్ ఎవరో ఆయన చెప్పకపోయినా వర్తమాన రాజకీయాలలో రచ్చగా జరుగుతున్న ఉదంతమే అని గుర్తు చేసుకుంటున్నారు.
మీరంతా ఏం చేస్తున్నారు :
తాను ఒక్కడితే బయటకు వచ్చి ప్రతీ దాని మీద మాట్లాడాలా అని పవన్ ఆవేశపడ్డారు. ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఉన్నారు కదా అని ఆయన తన పార్టీ వారికే గుర్తు చేశారు. రౌడీ చనిపోతే ఎందుకు దాని మీద మాట్లాడరు అని నిలదీశారు. క్రిమినల్స్ కి కులం ఉంటుందా అని ప్రశ్నించారు. ఓట్లు చూసుకుంటామా ఫలానా దాని మీద మాట్లాడితే ఆ వర్గం ఓట్లు ఈ వర్గం ఓట్లు పోతాయా అని ఆయన ప్రశ్నించారు. అలా చూసుకుంటూ మాట్లాడడం పద్ధతి అయిన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కులం దరిద్రం పోవాలంటూ :
ఏపీలో కులం దరిద్రం పోవాలని పవన్ గట్టిగా కోరుకుంటున్నారు. ప్రతీ దానికీ కులాన్ని ముడిపెట్టడం మీద కూడా ఆయన ఆగ్రహిస్తున్నారు. తనకు సంబంధం లేని విషయాలలోకి కూడా లాగుతున్నారని ఆయన అన్నారు. ఇదంతా తనకు ఇబ్బందికరంగా ఉంటోంది అని అన్నారు. ఒక ఎమ్మెల్సీ గతంలో మర్డర్ చేస్తే అది కాపులు చేసినట్లు అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. అలాగే నేరస్థులకు కులాలేంటని ఆయన నిలదీస్తున్నారు.
ఇష్యూస్ మీద మాట్లాడాల్సిందే :
రాష్ట్రంలో ప్రతీ రోజూ ఏదో ఒక సంఘటన జరుగుతుంది. దాని మీద ప్రభుత్వం విధానం ఏమిటి అన్నది స్పష్టంగా చెప్పే క్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీలు తమ వాణిని బలంగా వినిపించాలన్నదే పవన్ ఆలోచన అని అంటున్నారు. విపక్షం ప్రతీ దానికీ రాజకీయ రంగు పులిమి కులం కోణంతో విమర్శలు చేస్తూంటే దాని మీద కౌంటర్లు ఇవ్వడంలో జనసేన వెనకబడుతోంది అని అంటున్నారు. అందుకే పవన్ గట్టిగా క్లాస్ తీసుకోవాల్సి వచ్చిందని కూడా గుర్తు చేస్తున్నారు.
వాస్తవాలు చెప్పాలన్నదే :
పవన్ తన పార్టీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద గట్టిగా మాట్లాడింది ఏమిటి అంటే వారు నోరు తెరచి జరిగిన వాటిని జనం ముందు పెట్టాలని. ఆ విధంగా చేయడం వల్ల అసలు విషయాలు జనాలకు తెలుస్తాయని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే బహిరంగ సమావేశంలో పవన్ తన సొంత పార్టీ ప్రజా ప్రతినిధుల మీద ఘాటుగా వ్యాఖ్యలు చేయడం మాత్రం విశేషమే అని అంటున్నారు. పవన్ ఈ విధంగా క్లాస్ తీసుకుంటున్న నేపధ్యంలో అక్కడ హాజరైన జనాల నుంచి మంచి రెస్పాన్స్ రావడం కూడా గమనార్హం. అంటే ప్రజా ప్రతినిధులు నోరు విప్పాల్సిందే అని వారు కూడా కోరుకుంటున్నారు అని అర్ధం అవుతోంది మరి.