అయ్య బాబోయ్.. గుడ్డ ముక్క మునిగిపోయిందంట..! మాజీ ఎంపీ భరత్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
వైసీపీ మాజీ ఎంపీ, రాజమండ్రి సిటీ ఇంచార్జి మార్గాని భరత్ పై టీడీపీ ట్రోలింగ్ చర్చనీయాంశం అవుతోంది.
వైసీపీ మాజీ ఎంపీ, రాజమండ్రి సిటీ ఇంచార్జి మార్గాని భరత్ పై టీడీపీ ట్రోలింగ్ చర్చనీయాంశం అవుతోంది. విమర్శలు చేసేటప్పుడు కనీసం ఆలోచించరా? అసలు బుద్ధి, జ్ఞానం ఉందా? అంటూ సిటీ టీడీపీ నేత ఒకరు మాజీ ఎంపీ మార్గానిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గోదావరి వరదల్లో కోటిలింగాల రేవు వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ థియేటర్ స్క్రీన్ మునిగిపోయిందని కూడా విమర్శలు చేయడాన్ని ప్రస్తావిస్తూ సంతాప దినాలు ప్రకటించాలా? అంటూ టీడీపీ నేత మాట్లాడిన మాటలు ఆసక్తి రేపుతున్నాయి.
రాజమండ్రి సిటీ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఒక నాయకుడు మాజీ ఎంపీ మార్గాని భరత్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల గోదావరికి వరద పోటెత్తగా, నగరంలోని కోటిలింగాల రేవు వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏర్పాటుచేసిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రాంతం మునిగిపోయింది. రోజూ ఆహ్లాదం కోసం కోటి లింగాల రేవు వద్దకు వచ్చేవారి వినోదం కోసం ఎమ్మెల్యే స్క్రీన్ ఏర్పాటు చేశారు. అక్కడ రోజూ పాత సినిమాలు, ప్రత్యేక వీడియోలు వేస్తున్నారు. తాజాగా గోదావరికి వచ్చిన వరదలతో స్క్రీన్ మునిగిపోయింది.
ఈ విషయాన్ని వైసీపీ నేత మార్గాని భరత్ ఎత్తిచూపగా, గోదావరి మార్కు వెటకారంతో టీడీపీ తిప్పికొట్టింది. వరదల్లో ప్రజలు నష్టపోతే కనీసం పట్టించుకోని వైసీపీ నేతలు గోదావరి పక్కన పెట్టిన గుడ్డ ముక్క (స్క్రీన్) మునిగిపోతే బాధపడిపోవడం ఆశ్చర్యంగా ఉందని విమర్శలు గుప్పించారు. గుడ్డ ముక్క మునిగిపోతే సంతాప దినాలు ప్రకటించాలా? రెండు రోజులు ఎడవాలా? అంటూ మాజీ ఎంపీపై వ్యంగ్యస్త్రాలతో విరుచుకుపడటం వైరల్ అవుతోంది. సినిమాలు వేసే స్క్రీన్ వందల కోట్లు ఉంటుందా? అంటూ ప్రశ్నిస్తూ టీడీపీ ట్రోలింగ్ చేస్తోంది. ప్రజలు మునిగిపోయినా, ఇళ్లులు మునిగిపోయినా ఏ మాత్రం ఇబ్బంది లేదా? స్క్రీన్ మాత్రం మునిగిపోకూడదా? గోదావరి వస్తే మునిగిపోతుందని మాకు తెలియదా? అంటూ టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. అబద్ధాలు, ఫేక్ ప్రచారాలు తప్ప వైసీపీకి మరొకటి చేతకాదంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నగరంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏడుస్తున్నారని మండిపడుతున్నారు. కాగా, రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉన్న పోటీతో ప్రతి అంశం కూడా రాజకీయయే అయిపోయిందని తాజా ఘటన నిరూపిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వ్యక్తులు కూడా మాట్లాడే ముందు కనీసం ఆలోచించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నష్టం చేయనవి, ప్రాధాన్యం లేని అంశాలను తలకెత్తుకుని ట్రోలింగుకు గురవుతున్నారని చెబుతున్నారు.