ప‌య్యావుల కేశ‌వ్‌.. కాసుల‌ కుస్తీ.. !

ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ ప‌నితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2026-09-25 07:30 GMT

ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ ప‌నితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 జూన్ లో ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, రాష్ట్ర ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. బడ్జెట్ నిర్వహణ విష‌యంలో ఆయ‌న ఆప‌శోపాలు ప‌డుతున్నార‌న్న‌ది వాస్త‌వం. వైసీపీ ప్రభుత్వ హయాం నాటి ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు.

2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన రూ. 3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, ఇది వ్యవసాయం, సంక్షేమం మరియు పెట్టుబడుల వృద్ధికి ప్రాధాన్యతనిచ్చేలా రూపొందించారు. మ‌రోవైపు కేంద్రంతో సత్సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, నీతి ఆయోగ్‌తో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ, రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల సాధనలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 'వికసిత భారత్ 2047' వంటి విజన్ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక నమూనాలపై కేంద్రంతో చర్చిస్తున్నారు.

బ్యాంకర్లతో సమన్వయం: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశాల్లో పాల్గొంటూ రైతులకు, చిన్న వ్యాపారులకు తగినంత రుణ సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల 3,000 కోట్ల రూపాయ‌ల క్రెడిట్ అవుట్‌రీచ్‌ను అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఈ ప‌నుల ఒత్తిడి కార‌ణంగా ఫైళ్ల పరిష్కారంలో జాప్యం పెరిగిపోతోంద‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. అంతర్గత సమీక్షలో ప్రభుత్వ ఫైళ్ల క్లియరెన్స్‌లో పయ్యావుల కేశవ్ ఆఖరి స్థానంలో నిలిచినట్లు నివేదికలు వచ్చాయి.

ఆర్థిక శాఖ అత్యంత కీలకమైనది కావడంతో, ప్రతీ ఫైల్‌ను కూలంకషంగా పరిశీలించడం వల్లే ఈ జాప్యం జరుగుతోందనే అభిప్రాయం కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను, స్కామ్‌లను ఎండగట్టడంలో ప‌య్యావుల‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు ఆయనపై, ఆయన కుటుంబ నేపథ్యంపై రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిని స‌మ‌ర్థంగా తిప్పి కొట్టలేక ఇబ్బంది ప‌డుతున్న‌ది వాస్త‌వం. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నా.. ఆశించిన మేర‌కు స‌మ‌యం కేటాయించ‌లేక పోతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News