కుక్క కరవకపోయినా రేబీస్‌తో బాలుడు మృతి.. అసలు ఎలా జరిగిందంటే?

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో జరిగిన విషాద ఘటన ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసింది.

Update: 2026-09-25 05:35 GMT

కుక్క కరిస్తేనే రేబీస్‌ వస్తుందని అనుకోవడం పొరపాటే. రేబీస్‌ సోకిన జంతువు లాలాజలం గాయం, కళ్లు, ముక్కు, నోరు వంటి శరీర భాగాలకు తగిలినా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో జరిగిన విషాద ఘటన ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. కుక్క కరవకపోయినా.. దాని లాలాజలం ద్వారా రేబీస్‌ సోకి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన లక్కిశెట్టి రవితేజ, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి రెండేళ్ల కుమారుడు సోహాన్‌ రుద్రాన్ష్‌తో పాటు 20 రోజుల వయసున్న చిన్నారి కూడా ఉంది. రుద్రాన్ష్‌కు చిన్నప్పటి నుంచి కుక్కలంటే భయం లేకపోవడంతో ఇంటి పరిసరాల్లో ఉండే వీధి కుక్కలతో తరచూ ఆడుకునేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ క్రమంలో సుమారు 15 రోజుల క్రితం బాలుడు ఇంటి బయట ఆడుకుంటూ కిందపడిపోయాడు. దీంతో అతడి ముఖంపై చిన్న గాయం ఏర్పడింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వీధి కుక్క బాలుడితో ఆడుకుంటూ అతడి ముఖంపై ఉన్న గాయాన్ని నాకినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో కుక్క కరవకపోవడంతో తల్లిదండ్రులు పెద్దగా అనుమానించలేదు. అయితే ఆ కుక్క లాలాజలం గాయంపై పడటం ద్వారా రేబీస్‌ వైరస్‌ బాలుడి శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.

కొన్ని రోజుల వరకు బాలుడు సాధారణంగానే ఉన్నాడు. అయితే ఈ నెల 22న అతడి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపించాయి. భయంతో కేకలు వేయడం, నీళ్లు తాగడానికి ఇబ్బంది పడటం, వెక్కిళ్లు పెట్టడం వంటి లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు వెంటనే నరసరావుపేటలోని ఓ పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు రేబీస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి.. వ్యాధి తీవ్ర దశకు చేరుకుందని తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

మెరుగైన చికిత్స కోసం అదే రోజు రాత్రి బాలుడిని గుంటూరుకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందినట్లు సమాచారం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని అకస్మాత్తుగా కోల్పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ ఘటన రేబీస్‌పై అవగాహన ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. కుక్క కరవకపోయినా.. రేబీస్‌ అనుమానం ఉన్న జంతువు లాలాజలం తెరిచి ఉన్న గాయం లేదా కళ్లు, ముక్కు, నోరు వంటి శరీర భాగాలకు తగిలితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో వెంటనే గాయాన్ని సబ్బు, ప్రవహించే నీటితో శుభ్రంగా కడిగి, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన రేబీస్‌ నిరోధక చికిత్స తీసుకోవడం అత్యంత కీలకం.

Tags:    

Similar News