అసలే కాదు కొసరు కూడా షాకింగ్.. భీమ్ రెడ్డి బినామీల ముచ్చటే వేరప్పా!

అసలుకు మించి కొసరు అన్నట్లుగా ఉంది డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల లెక్క.

Update: 2026-09-25 05:00 GMT

అసలుకు మించి కొసరు అన్నట్లుగా ఉంది డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల లెక్క. ఏసీబీ అధికారులు భీమ్ రెడ్డి నివాసంపై దాడులు చేయటం.. ఈ సందర్భంగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన లెక్కల్ని వెలికి తీయటమే కాదు.. అతడి ఆస్తులు రూ.200 కోట్లకుపైనే ఉందన్న ప్రాథమిక సమాచారం సంచలనంగా మారింది. తాజాగా ఈ అవినీతి అనకొండ లెక్క తేల్చే పనిలో మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

ఈ జులై 2న డీజీపీ ఆఫీస్ స్టేషనరీ వింగ్ లో పని చేస్తున్న భీమ్ రెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించగా.. అక్కడ లభించిన క్యాష్ ను లెక్క కట్టేందుకు.. ఆస్తుల లెక్క తేల్చేందుకు దాదాపు రెండు రోజుల సమయం తీసుకోవటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అతగాడికి హైదరాబాద్.. జహీరాబాద్.. రంగారెడ్డి.. శంషాబాద్.. గచ్చిబౌలి.. వికారాబాద్ సహా మొత్తం పదహారు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు.

ఇది సరిపోదన్నట్లు ఆయన బంధువులు.. ఆప్తులు మాత్రమే కాదు.. తాను నమ్మినోళ్లను సైతం బినామీలుగా మార్చుకున్న వైనం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఏసీబీ అధికారుల సోదాల వేళ.. భీమ్ రెడ్డికి చెందిన డైరీని గుర్తించారు.ఇందులో తన పదిహేనుమంది ముఖ్య బినామీల వివరాలు అందులో ఉన్నాయి. అంతేకాదు.. ఈ కేసులో భీమ్ రెడ్డి సతీమణి సెల్ ఫోన్ కీలకంగా మారింది. ఆమె ఫోన్ లోని కొన్ని ఫోటోల్లో కుటుంబ సభ్యులకు ఏ ఆస్తి కేటాయించాలి? ఏ బినామీ పేరుతో ఎంత ఆస్తి ఉంది? ఎవరికెంత ఇవ్వాలనన వివరాలు హ్యాండ్ రైటింగ్ తో రాసుకొని ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

దీని ఆధారంగా బినామీల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తూ.. అవినీతి కొండ ఆస్తుల చిట్టా బయటపెడుతున్నారు. భీమ్ రెడ్డి తరఫు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారన్నఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్డర్ వెంకటేశ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా.. రూ.1.35 కోట్ల క్యాష్.. విదేశీ నగదుతో పాటు పలు వివరాల్ని గుర్తించారు. గతంలో ఇతగాడు టౌలిచౌకిలో హోల్ సేల్ బియ్యం వ్యాపారం చేసినట్లుగా గుర్తించారు. భీమ్ రెడ్డి పరిచయంతో కోటీశ్వరుడైన అతగాడు ఎదిగిన క్రమాన్ని అధికారులు అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు.. జహీరాబాద్ లోని భీమ రెడ్డి ఆస్తులు.. ఫాంహౌస్ నిర్వహణ చూసుకునే మాజీ హోంగార్డు లక్ష్మణ్ నాయక్ ఇల్లు.. ఆఫీసులో సోదాలు చేపట్టగా కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. అతడి పేరు మీదా.. అతడి బంధువుల పేరు మీదా 47.5 ఎకరాల భూమి రిజిస్టర్ చేసి ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు అవాక్కు అవుతున్నారు. హోంగార్డు ఉద్యోగాన్ని మానేసి.. ఏకంగా బంగారం షాపు పెట్టిన దాని వెనుక భీమ్ రెడ్డి మాయాజాలం ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. మరో బినామీ ఇంట్లో పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. పలువురు బినామీలు తమ ఫోన్లను ధ్వంసం చేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ లెక్కన భీమ్ రెడ్డి ఆస్తుల విలువ రూ.400 కోట్లు దాటి పోతున్నట్లుగా తెలుస్తోంది. మరింత లోతుల్లోకి వెళితే.. మరెన్ని విస్మయకర ఆస్తుల చిట్టాబయటకు వస్తుందన్నది ఇప్పుడు చర్చగా మారింది.

Tags:    

Similar News