బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!
| తన ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేశారంటూ బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ వేసిన పరువు నష్టం కేసును కొనసాగించేందుకు ఫ్లోరిడా ఫెడరల్ కోర్టు అనుమతించింది. కేసును కొట్టివేయాలన్న బీబీసీ అభ్యర్థనను తిరస్కరించింది. అయితే ట్రంప్ ఆరోపణలు నిజమని కోర్టు నిర్ధారించలేదు. వాటిని ఆయన నిరూపించాల్సి ఉంది. డిసెంబర్ 11లోగా ట్రంప్ డిపోజిషన్‌కు హాజరుకావాలని ఆదేశించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ మధ్య న్యాయపోరాటం మరో మలుపు తిరిగింది. తన ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసి ప్రజలకు తప్పుడు సందేశం ఇచ్చారంటూ ట్రంప్ వేసిన పరువు నష్టం కేసును కొనసాగించేందుకు ఫ్లోరిడా ఫెడరల్ కోర్టు అనుమతించింది. దీంతో ఈ కేసును మొదట్లోనే కొట్టివేయాలన్న బీబీసీ ప్రయత్నం ఫలించలేదు.
2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన రోజున ఆయన చేసిన ప్రసంగమే ఈ వివాదానికి కారణం. 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు బీబీసీ ప్రసారం చేసిన 'పనోరమా' డాక్యుమెంటరీలో ఆ ప్రసంగానికి సంబంధించిన రెండు వేర్వేరు భాగాలను కలిపి చూపించారు. ఈ రెండు వ్యాఖ్యల మధ్య దాదాపు 55 నిమిషాల వ్యవధి ఉంది. వాటిని ఒకే వీడియోగా చూపించడంతో ట్రంప్ హింసకు పిలుపునిచ్చినట్లు అర్థం వచ్చేలా ఉందని ఆయన ఆరోపించారు.
ఈ ఎడిటింగ్‌పై విమర్శలు రావడంతో బీబీసీ గతంలోనే ట్రంప్‌కు క్షమాపణ చెప్పింది. అయితే తమ తప్పును అంగీకరించినంత మాత్రాన పరువు నష్టం జరిగిందనే ఆరోపణను అంగీకరించినట్లు కాదని సంస్థ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేయాలంటూ కోర్టును ఆశ్రయించింది.
తాజాగా జడ్జి జెఫ్రీ కుంట్జ్ ఆ వాదనను పూర్తిగా అంగీకరించలేదు. రెండు వ్యాఖ్యల మధ్య అంతటి వ్యవధి ఉన్నప్పుడు వాటిని కలిపి చూపించడం సాధారణ ఎడిటింగ్‌గా చూడలేమని అభిప్రాయపడ్డారు. ట్రంప్ చేసిన ఆరోపణలను విచారణకు తీసుకెళ్లడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే ట్రంప్‌కు అన్ని విషయాల్లోనూ అనుకూల తీర్పు రాలేదు. ఫ్లోరిడా వినియోగదారుల రక్షణ చట్టం కింద ఆయన వేసిన మరో కేసును న్యాయమూర్తి కొట్టివేశారు. పరువు నష్టం ఆరోపణలు నిజమని కూడా కోర్టు తేల్చలేదు. వాటిని ట్రంప్ నిరూపించాల్సి ఉంటుంది.
ట్రంప్ మాత్రం ఈ పరిణామాన్ని తనకు భారీ విజయంగా అభివర్ణించారు. బీబీసీ తమ వైఖరిని సమర్థించుకుంటూ న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపింది.
ఇదిలా ఉంటే, ఈ కేసులో బీబీసీ న్యాయవాదులు ట్రంప్‌ను ప్రశ్నించేందుకు డిసెంబర్ 11లోగా ఆయన డిపోజిషన్‌కు హాజరుకావాలని మరో కోర్టు ఆదేశించింది. అంటే ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఒక వార్తా సంస్థ చేసిన ఎడిటింగ్ పొరపాటు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడితో భారీ న్యాయపోరాటంగా మారింది.