రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?
| రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడి ఆరోగ్యం విషమంగా మారింది. అనంతపురం ఆస్పత్రి వైద్యులు అతడికి పల్మనరీ ఎంబాలిజం సమస్య ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం మెరుగుపడుతోంది. ప్రస్తుతం నోటి ద్వారా ద్రవ ఆహారం తీసుకుంటోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రికల్ రంపంతో దాడి చేసిన నిందితుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అనంతపురం ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పోలీసు కాల్పుల్లో గాయపడిన నిందితుడి కుడికాలును ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న నిందితుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఆస్పత్రి బెడ్ పై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు. ఆస్పత్రి వైద్యులు సీటీ స్కాన్ నిర్వహించగా రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినట్లుగా గుర్తించారని సమాచారం. దీనిని వైద్యపరిభాషలో పల్మనరీ ఎంబాలిజంగా చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వారికి ప్రాణాపాయం ఉంటుందని అంటున్నారు.
విద్యార్థిపై దాడి అనంతరం నిందితుడిని కాల్చి చంపాలని ప్రజలు డిమాండ్ చేశారు. అయితే అతడి పాపం ఊరకే పోదన్నట్లు ప్రస్తుతం దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు పోస్ట్ ఆపరేషన్ కాంప్లికేషన్స్ ఎదుర్కుంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సహజంగా శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, కానీ నిందితుడు తీవ్రమైన పల్మనరీ ఎంబాలిజం బారిన పడటంతో ఆరోగ్యం విషమంగా మారిందని అంటున్నారు. ఈ సమస్య నుంచి అతడిని రక్షించేందుకు ప్రత్యేక చికిత్సలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అతడి శరీరంలో ప్రవహిస్తున్న రక్తం చిన్నచిన్న గడ్డలుగా మారుతోందని, ఇలా ఏర్పడిన గడ్డలు ఊపిరితిత్తుల్లో చిక్కుకుపోతే రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడి గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
నిందితుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలతో బతికిన అంత కాలం దుర్భర జీవితమే అనుభవించాల్సివుంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అభం శుభం తెలియని బాలికపై పాశవికంగా దాడి చేసిన నిందితుడిని విధి క్షమించలేదని తాజా పరిస్థితులు రుజువు చేస్తున్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు నిందితుడు దాడిలో గాయపడిన బాలిక బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో కోలుకుంటోందని మంత్రి లోకేశ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. చికిత్సకు బాలిక ఆరోగ్యం సహకరిస్తోందని, రోజురోజుకు ఆమె పరిస్థితిలో మార్పు వస్తోందని మంత్రి లోకేశ్ వివరించారు. ప్రస్తుతం నోటి ద్వారా ద్రవ ఆహారం తీసుకుంటోందని, త్వరగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే పరిస్థితి వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. బాలిక ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉందని, నోటిద్వారా ఆహారం తీసుకుంటున్నందున ఎన్జీ ట్యూబ్ ను తొలగించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా బాలిక గాయాలు తగ్గుతున్నాయని, భుజంలో కదలిక వచ్చిందని చెబుతున్నారు. మొత్తానికి బాలిక క్షేమ సమాచారం అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.