రంపంతో నరికాడు...తూటాతో కూలాడు !
మెదడులో కర్కశత్వం ఆవహించి రెండు కాళ్ళ మృగంగా మారిన ఆ యువకుడు బలమైన చెట్లు నరికే రంపంతో బలహీనమైన ఒక అమాయక బాలికను నరికాడు.
మెదడులో కర్కశత్వం ఆవహించి రెండు కాళ్ళ మృగంగా మారిన ఆ యువకుడు బలమైన చెట్లు నరికే రంపంతో బలహీనమైన ఒక అమాయక బాలికను నరికాడు. ఆమె ఇప్పుడు చావు బతుకుల మధ్యన బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే ఆ కిరాతకుడూ తూటాలకు కుప్ప కూలాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంతకీ ఇందులో తప్పుకు శిక్ష పడినట్లుగా ఉన్నా ఎక్కడో ఏమిటిలా జరుగుతోంది అని ప్రతీ ఒక్కరికీ అనిపించకమానదు.
రాప్తాడు ఘటనతో :
రాప్తాడు జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివే ఒక బాలికని రంపంతో దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేసి చావు అంచులకి చేర్చిన నిందితుడు తాను తప్పించుకుందామని అనుకున్నాడు. పరారి అయ్యాడు . ఆ నిందితుడు హేమంత్ మీద ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కాల్పులు జరిపారు. అతన్ని పట్టుకుందామని చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్లనే ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు అంటున్నారు. మొత్తానికి హేమంత్ కూడా చావుకు చేరువ అయ్యాడు.
అసలు ఎందుకిలా :
ఆ బాలిక ముక్కు పచ్చలారనిది. హేమంత్ వయసు కూడా రెండు పదులు దాటుతుందేమో. ఎంతో జీవితం ఉన్న ఈ యువకుడు ఇలా కిరాతకుడు ఎలా అయ్యాడు, బాలిక మీద కనికరం లేకుండా రంపంతో దాడి చేసేంత కసి ఆతని మెదడులో ఎలా పుట్టింది. ఇంతటి నేర ప్రవృత్తితో నిండిన మెదళ్ళు ఎన్ని ఉన్నాయి. దొరికిన దొంగ హేమంత్ ఒక్కడేనా దొరకని కర్కశులు ఇంకెందరు. ఇదే సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. ముల్లుని ముల్లుతోనే కోయాలి. కానీ మళ్లీ ముల్లే వస్తుంది. అక్కడ పువ్వు అయితే మొలవదు. ఇలాంటి శిక్షలుచూసినపుడు మానవతావాదులు అనేది ఇదే. మరి శిక్ష ఏమిటి ఎలా విధించాలి. ఈ ప్రశ్నలకు జవాబు ఉందా అంటే లేదనే అనాలి.
ఆయుధానికి శిక్ష :
అవును ఆయుధానికి శిక్ష వేస్తే చేతులు ఆగుతాయా. అవి మళ్ళీ కొత్త ఆయుధాన్ని పట్టుకుంటాయి. అలాగే కర్కశుల మెదళ్ళలో ఉన్న కిరాతకాన్ని తీసి పాతరేసే మందు కనుగొనకుండా ఈ తరహా శిక్షలు అమలు చేస్తే ఫలితం ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న. అసలు మెదళ్ళను చెడగొడుతున్నదెవరు, మనిషిలో దానవుడిని పెంచుతున్నది ఎవరు, ఇవి చిన్న ప్రశ్నలే కానీ జవాబుకు అందనివి. అందుకే తాత్కాలికమైన ఉపశమనాలనే సమాజం వెతుక్కుంటోందా అనిపిస్తుంది.
యువత పెడ త్రోవలో :
ఈనాటి యువత పెడ త్రోవ పడుతోంది అంటే దానికి కారణం సమాజమే అన్నది మేధావుల మాట. సమాజంలో నుంచే మంచిని చెడుని మెదడు తీసుకుంటుంది. చెడు ఎక్కువగా ఉన్న చోట మెదడు అదే పీలుస్తుంది, అదే ఆస్వాదిస్తుంది. మరి ఆ చెడు సినిమాల నుంచి వస్తోందా అంటే లేదని ఆ వైపు జవాబు ఉంది. సమాజాన్ని చూసే మేము అంటుంది ఆ వైపు జనం. మరి ఎక్కడ నుంచి అంటే మారిన కల్చర్ నుంచా విచ్చలవిడితనం నుంచా. అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు అందులో నుంచి మొత్తం కనిపించే ప్రపంచం అందిస్తున్న అధిక డోసుల కల్మషం నుంచా అంటే అది కూడా కావచ్చేమో.
నైతికత లోపం :
ఎపుడూ మంచి చెడులకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. కానీ నైతికత అన్నది ఒకటి ఉంటుంది. అది బలంగా ఉన్నపుడు మంచి వైపే చూస్తుంది. కానీ ఈ రోజున సమాజం నైతికత లోపంతో కొట్టుమిట్టాడుతోంది అన్నది అయితే అంతా అంగీకరించే విషయం. ఆ కారణంగానే బిడ్డ నుంచి వృద్ధుడి వరకూ అందరూ వంకర చూపులూ వంకర మాటలుగా మారుతున్నారు నైతికత క్షీణించిన సమాజంలో ప్రతీ మెదడూ ఒక కాలకూట విషమే అవుతుంది. ప్రతీ మనిషీ అవకాశం దొరిక్తే నేరస్థుడే అవుతాడు. మరి ఆ మెదళ్లకు పట్టిన చీడను పీడను వదిలించకుండా చేతికి పట్టిన ఆయుధానికి శిక్ష వేస్తే ఫలితం ఉందా. ఇదే సభ్య సమాజంలో వివేకులు సూటిగా ప్రశ్నిస్తున్న మాట.