రాప్తాడు స్థానిక ఎన్నికల్లో వైసీపీ పట్టెంత.. ?
అనంతపురంజిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఒకప్పుడు వైసీపీ ప్రభావం ఉన్నా.. ఇప్పుడు దాదాపు కనుమరుగైం దన్న వాదన వినిపిస్తోంది.
అనంతపురంజిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఒకప్పుడు వైసీపీ ప్రభావం ఉన్నా.. ఇప్పుడు దాదాపు కనుమరుగైందన్న వాదన వినిపిస్తోంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాప్తాడు మండల పరిషత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. రాప్తాడు మండల పరిషత్‌కు సంబంధించిన స్థానిక ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. రాప్తాడు మండల పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గం పరిధిలో మొత్తం 11 స్థానాలు ఉన్నాయి. వీటిలో వైసీపీ ఏకంగా 9 స్థానాలను గెలుచుకుంది.
ఎన్నికైన ఈ 11 మంది సభ్యులలో ఏడుగురు మహిళలు కావడం విశేషం. ఇదిలా ఉంటే, 2024 లో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రాప్తాడు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత విజయం సాధించగా, వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా గత వైభవాన్ని తిరిగి సాధించేందుకు.. తోపుదుర్తి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మండలాల స్థాయిలో రాజకీయాల వేగం పెంచారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి.
రాప్తాడు మండలం రాజకీయ బలాబలాలు: నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడులో టీడీపీ కేడర్ బలంగా పుంజుకుంది. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ ఇక్కడ విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.మరోవైపు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ వర్గం రైతుల విద్యుత్ సమస్యలపై నిరసనలు తెలుపుతూ కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
రామగిరి: పరిటాల కుటుంబానికి రామగిరి ఒకప్పుడు అత్యంత బలమైన కోట. అయితే, గత కొన్నేళ్లుగా ఇక్కడ తోపుదుర్తి వర్గం కూడా గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. ఇరువర్గాల మధ్య తరచూ స్థానిక వివాదాలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడెక్కి ఉంటోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల పట్టు ఇక్కడ మళ్లీ పెరిగింది.
కనగానపల్లి: ఈ మండలంలో గ్రామ స్థాయి రాజకీయాలు చాలా చురుగ్గా ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆత్మకూరు: ఈ మండలంలో విద్యా, మౌలిక వసతుల కల్పన వంటి స్థానిక సమస్యలపై ఇక్కడ రాజకీయం నడుస్తోంది. ప్రభుత్వ నిధులతో ఇక్కడి పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి టీడీపీ ప్రాధాన్యత ఇస్తుండగా, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ స్థానిక రైతాంగ సమస్యలపై గళమెత్తుతోంది.
చెన్నేకొత్తపల్లి: ఈ మండలంలో ఫ్యాక్షన్ ఛాయలు, పాత రాజకీయ కక్షలు అంతర్గతంగా ప్రభావం చూపుతుంటాయి. దీంతో స్థానిక ఎన్నికల్లోనూ ఈ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. మొత్తంగా రాప్తాడులో టీడీపీ తన సత్తాను మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండగా.. వైసీపీ నేత తోపుదుర్తి తన ప్రతిష్ఠను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు.