'చెప్పుతో కొడతా'.. వైసీపీ నేతపై ఎమ్మెల్యే ఫైర్!
వైసీపీ-టీడీపీ నేతల మధ్య రాజకీయ వివాదాలు ఓ రేంజ్‌లో కొనసాగుతున్నాయి. ఇక, సీమలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు మధ్య మరింత వేడి రాజుకుంది.
వైసీపీ-టీడీపీ నేతల మధ్య రాజకీయ వివాదాలు ఓ రేంజ్‌లో కొనసాగుతున్నాయి. ఇక, సీమలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు మధ్య మరింత వేడి రాజుకుంది. తాజాగా అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. ఇదే జిల్లాలోని మడకశిర ఎమ్మెల్యే, టీడీపీ ఎస్సీ నేత.. ఎం.ఎస్. రాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమాలు, అవినీతిలో కూరుకుపోయాడని ఆరోపించారు.
దీంతో ఎం.ఎస్. రాజు కూడా అంతే తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ రువ్వారు. నిరూపించలేకపోతే.. ఇంటికి వచ్చి చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. ఈ పరిణామాల క్రమంలో గురువారం ఇరు పక్షాలు నిరూపణలకు సిద్ధమయ్యాయి. ఇంతలో అలెర్ట్ అయిన పోలీసులు.. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు తోపుదుర్తి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆయన ఇంట్లో మారణాయుధాలు, నాటు బాంబులు ఉన్నాయని టీడీపీ నేతల నుంచి ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నా రు.
ఈ క్రమంలో చేసిన తనిఖీల్లో భారీ ఎత్తున కంకర రాళ్ల గుట్టలు, కర్రలు, బీరు బాటిళ్లు లభించాయని పోలీసులు తెలిపారు. ఆ వెంటనే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు.. తన అనుచరులతో తోపుదుర్తి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిని కూడా పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో తోపుదుర్తి వర్గం నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపైనా పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారన్న కేసులు పెట్టేందుకు రెడీ అయ్యారు.
ఇదిలావుంటే, తోపుదుర్తి చేసిన ఆరోపణలపై తదుపరికార్యాచరణ చేపట్టేందుకు ఎమ్మెల్యే రాజు టీడీపీ సీనియర్లతో భేటీ అయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఆయన నివాసానికి వెళ్లారు. తోపుదుర్తి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, బహిరంగ సవాళ్లు వద్దని సీనియర్లు ఈ సందర్భంగా సూచించారు. పార్టీ పరంగా అధినేత తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.