కేటీఆర్, హరీష్ రావు పై కవిత సంచలన ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తూ, బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తూ, బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీష్ రావుల టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ఖాతాలోని రూ. 1,400 కోట్లు క్విడ్ ప్రో కో నిధులేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అవినీతికి హరీష్ రావే బాధ్యుడని, కేటీఆర్ క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని ధ్వజమెత్తిన ఆమె.. దమ్ముంటే ప్రజా సమస్యలపై తమతో పోటీ పడాలని గులాబీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెబుతూ ‘‘కేటీఆర్, హరీష్ రావు’’లను బండ బూతులు తిడుతూ రాజకీయంగా తీవ్ర దుమారం రేపారు.
కొత్తగూడెంలోని పీవీకే-5 సింగరేణి గనిలో కార్మికులతో సమావేశమైన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, హరీశ్ రావులను లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్‌కు బహిరంగ సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీతో పోటీ పడాలని డిమాండ్ చేశారు. ఓ ఆడబిడ్డగా ప్రజల మధ్యకు నేను ధైర్యంగా వెళుతుంటే ఆంబోతుల్లా.. అడ్డగాడిదల్లా నా కాళ్లలో ఎందుకు కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
పార్టీ రిజిస్ట్రేషన్, మీడియాపై ఒత్తిడి.. కవిత సంచలన ఆరోపణలు
తాను కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే తమకు ఎలాంటి భయం లేదని బీఆర్ఎస్ నేతలు పైకి చెబుతున్నారని.. కానీ లోపాయకారీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. తమ పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన వార్తలను ప్రచురించవద్దని కొన్ని మీడియా సంస్థలపై కేటీఆర్ , బీఆర్ఎస్ నేతలు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ పేరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని.. అయితే ప్రజల ఆశీర్వాదమే తమకు ప్రధాన బలమని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారికి మర్యాదగా వ్యవహరించాలని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
అవినీతి ఆరోపణలు.. క్విడ్ ప్రో కో వివాదం
బీఆర్ఎస్‌ను జోడెద్దుల్లా నడిపించాల్సిన కేటీఆర్, హరీశ్ రావు ప్రజా సమస్యలను విస్మరించి దున్నపోతుల్లా కేవలం అవినీతి అంశాలనే కాపాడుతున్నారని కవిత ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి హరీశ్ రావే ప్రధాన బాధ్యుడని విమర్శించారు. అలాగే కేటీఆర్ కొంతమంది సంస్థలకు క్విడ్ ప్రో కో విధానంలో అక్రమ ప్రయోజనాలు కల్పించారని ఆరోపించారు. "బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ. 1,400 కోట్లు క్విడ్ ప్రో కో ద్వారా వచ్చిన నిధులే. ఆ మొత్తంపై సమగ్ర విచారణ జరిపి తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పంపిణీ చేయాలి’’ అని కవిత డిమాండ్ చేశారు.
ఫీనిక్స్ సంస్థకు భారీ స్థాయిలో ప్రభుత్వ భూములు కేటాయించడంపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. తాము అధికారంలోకి వస్తే 2014 నుంచి కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కేటాయించిన భూములన్నింటినీ సమీక్షిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు.. సింగరేణి కార్మికుల కోసం పోరాటం
బీఆర్ఎస్ అవినీతికి తలుపులు తెరిచినట్లే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని కవిత ఆరోపించారు. రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాళేశ్వరం అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు.
సింగరేణి పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణకు చెందిన బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే, ఈ నెల 20 నుంచి రామగుండంలో నిరవధిక దీక్ష చేపడతామని కవిత హెచ్చరించారు.