సుప్రీంకోర్టుకు చేరిన 'సాయికృష్ణ' కేసు..!
ఆయనను లాకప్ డెత్ చేశారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నప్పటికీ.. తగిన ఆధారాలను ఇప్పటి వరకు సేకరించలేదు.
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆయనను లాకప్ డెత్ చేశారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నప్పటికీ.. తగిన ఆధారాలను ఇప్పటి వరకు సేకరించలేదు. అయితే.. పోలీసు స్టేషన్ టెర్రస్‌పై బూడిద, అనుమానిత మరకలు ఉన్న లాటీ, ఓ స్టీల్ చైన్‌ను మాత్రమే స్వాధీనం చేసుకున్నామని..ఈ కేసులో చాలా పురోగతి సాధించాల్సి ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు.
ఇక, ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ నాగరాజును అరెస్టు చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఇక్కడే కథ కీలక మలుపులు తిరుగుతోంది. నాగరాజును తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే.. నాగరాజును విచారించేందుకు కోర్టులు అంగీకరిస్తున్నా.. సిట్ అధికారులు తమ కస్టడీకి తీసుకునే విషయంలో మాత్రం అంగీకరించడం లేదు. ఈ వ్యవహారమే ఇప్పుడు కీలకంగా మారింది.
తాజాగా ప్రభుత్వమే ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. బుధవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఏమందంటే.. ``నాగరాజును విచారించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఆయనను కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతించం. ఒక్కరోజు మాత్రమే ఆయన పనిచేసిన కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో విచారించాలి. తర్వాత.. 7 రోజులు రాజమండ్రి జైల్లోనే విచారించాలి. ఇదంతా ఆడియో కాకుండా.. వీడియో మాత్రమే తీయాలి. న్యాయవాదిని ఉంచాలి. దురుసుగా ప్రవర్తించరాదు`` అని తేల్చి చెప్పింది.
దీనిని సిట్ కాదంటోంది. ఇది తీవ్రమైన నేరమని, సాయికృష్ణను లాకప్‌డెత్ చేశారని పేర్కొంటోంది. అసలు ఆయన మృతదేహాన్ని ఏం చేశారో తెలియాలంటే.. కస్టడీలోకి తీసుకునే విచారించాలని పట్టు బడుతోంది. అంతేకాదు.. విచారణ మొత్తాన్నీ ఆడియో కూడా తీయాలని కోరుతోంది. అంతేకాదు.. విచారణ జరిగినన్ని రోజులు కృష్ణలంక పోలీసు స్టేషన్‌లోనే విచారించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతించకపోవడంతో సుప్రీంకోర్టులో రాష్ట్ర హోం శాఖ పిటిషన్ వేసింది. దీనిని అత్యవసరంగా విచారించాలని కోరింది. అయితే.. సుప్రీంకోర్టు తగిన సమయం తర్వాత విచారణ చేస్తామని చెప్పడం గమనార్హం.