ఆ ఇద్దరికీ ఇష్టమైతే మనకెందుకు కష్టం.. విడాకులపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలతో విడిపోవాలని నిర్ణయించుకున్న దంపతులకు తక్షణమే విడాకులు మంజూరు చేయాలని ఏపీ హైకోర్టు సూచించింది.

Update: 2026-06-26 04:57 GMT

వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలతో విడిపోవాలని నిర్ణయించుకున్న దంపతులకు తక్షణమే విడాకులు మంజూరు చేయాలని ఏపీ హైకోర్టు సూచించింది. పరస్పర అంగీకారంతో విడాకులు కోరే దంపతులు, హిందూ వివాహ చట్టం ప్రకారం 'ఆరు నెలల కూలింగ్ పీరియడ్' కోసం తప్పనిసరిగా వేచి ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు కుటుంబ న్యాయస్థానాల పరిధిలో విడాకుల ప్రక్రియను మరింత వేగవంతం చేయనుందని అంటున్నారు. చిన్నచిన్న భేదాభిప్రాయాలతో నిత్యం గొడవలు పడే భార్యభర్తలు విడాకులు తీసుకుందామనే తీవ్ర నిర్ణయం తీసుకుంటే, ఆ ఇద్దరు మళ్లీ దగ్గరయ్యే అవకాశాలను పరిశీలించేందుకు ‘ఆరు నెలల కూలింగ్ పిరియడ్’ను న్యాయస్థానం విధించేది. అయితే దీనివల్ల సుదీర్ఘ కాలం పాటు వేరువేరుగా ఉండే దంపతులకు ఎలాంటి ప్రయోజనం లేదని భావించిన న్యాయస్థానం అలాంటి కేసుల విషయంలో ఆరు నెలలు వేచిచూడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(బి)(2) ప్రకారం, విడాకుల పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దంపతులకు ఆరు నెలల సమయం ఇస్తారు. ఈ గడువును 'కూలింగ్ పీరియడ్'గా పిలుస్తారు. దంపతులు తమ నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షించుకోవడానికి, అవసరమైతే తమ మనసు మార్చుకుని తిరిగి కలిసి జీవించే అవకాశాన్ని పరిశీలించడానికి చట్టం ఈ వెసులుబాటు కల్పించింది. దశాబ్దాలుగా కోర్టులు ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తూ వస్తున్నాయి. దీంతో విడిపోదామని భావించిన వారు ఈ సమయంలో మనసు మార్చుకుని మళ్లీ దగ్గరయ్యే అనేక ఉదంతాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆలూమగలు స్వతహాగా విడిపోవాలనే నిర్ణయానికి వస్తూ చట్ట రక్షణ కోసం కోర్టులకు వెళుతున్నారు. ఇలాంటి వారు తమ భవిష్యత్తు ప్రయాణం కోసం లీగల్ డైవర్స్ కోసం ఎదురుచూడాల్సివస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఈ తరహా కేసులకు ఉపయోగపడుతుందని అంటున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఒక జంట పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అయితే, ఆస్తి పంపిణీ, భరణం, ఇతర వ్యక్తిగత సమస్యలను వారు ఇప్పటికే సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అయినప్పటికీ, స్థానిక ఫ్యామిలీ కోర్టు ఆరు నెలల కూలింగ్ పీరియడ్ తప్పనిసరి అని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ఉటంకిస్తూ కీలక విశ్లేషణ చేశారు.

దంపతుల మధ్య ఎటువంటి రాజీ మార్గాలు లేనప్పుడు కలిసి జీవించే అవకాశం పూర్తిగా సన్నగిల్లినప్పుడు, అనవసరంగా ఆరు నెలల పాటు వారిని వేచి ఉంచడం వల్ల ప్రయోజనం ఉండదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, కూలింగ్ పీరియడ్ అనేది తప్పనిసరి నియమం కాదని, పరిస్థితులను బట్టి దానిని మినహాయించే విచక్షణాధికారం కోర్టులకు ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ తీర్పు ద్వారా విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే వారికి పెద్ద ఊరట లభించిందని వ్యాఖ్యానిస్తున్నారు. భార్యాభర్తలు ఇప్పటికే అన్ని విషయాల్లో అవగాహనకు వచ్చి, విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు వారిని బలవంతంగా బంధించడం వల్ల మరింత మానసిక వేదన తప్ప ఇంకేం ప్రయోజనం లేదని కోర్టు గుర్తించిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఉత్తర్వుల వల్ల, ఇకపై కోర్టులో దంపతులు తమ వాదనను సరిగ్గా వినిపిస్తే, ఆరు నెలల గడువు లేకుండానే విడాకుల మంజూరు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News