మీకు మేం ఏమీ చేయలేం: మీనాక్షికి సుప్రీం షాక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్.. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు.. మీనాక్షి నటరాజన్‌కు.. సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్.. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు.. మీనాక్షి నటరాజన్‌కు.. సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ''మీకు ఈ దశలో మేం ఏమీ చేయలేం.'' అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘంలోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. దీంతో మీనాక్షికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
ఏం జరిగింది?
తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల పోరులో మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ నుంచి అవకాశం కల్పించింది. దీంతో ఆమె నామినేషన్ల చివరి రోజైన ఈ నెల 8వ తారీకున తన నామినేషన్‌ను దాఖలు చేశారు.అయితే.. దీనిలో ఆమె తనపైనమోదైన కేసుల వివరాలు పేర్కొనలేదని.. దీనిని అనర్హతగా ప్రకటించాలని బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆమె నామినేషన్ పరిశీలించి ఆ వెంటనే నామినేషన్‌ను తిరస్కరించారు.
దీని పై నటరాజన్‌కు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంవ్యక్తంచేశారు. ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన చర్యగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని ఆమె.. సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్ విచారణకు రాగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, న్యాయవాది కపిల్ సిబల్ మీనాక్షి తరఫున వాదనలు వినిపించారు. ఆమె పై కనీసం రెండేళ్లపాటు శిక్ష పడే కేసు ఏదీ లేదని.. కేవలం ఓ కేసులో సమన్లు మాత్రమే జారీ చేశారని తెలిపారు.
ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసిన చర్యగా సిబల్ వాదించారు. అయితే.. నామినేషన్ల తిరస్కరణ అనేది.. ఎన్నికల పిటిషన్ అని.. దీనిని ఆ విధంగా చూస్తామని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనిపై ఎన్ని కల సంఘంలోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని తెలిపింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరిస్తే.. దానిని కోర్టుల్లో సవాల్ చేయలేరని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
ఒక వేళ.. ఇలాంటి కేసులు గతంలో కోర్టులకు వచ్చాయా? అలా వచ్చి ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. దీంతో న్యాయవాది సిబల్ తెలియదని సమాధానం ఇచ్చారు. మొత్తంగా నటరాజన్‌కు నిరాశే ఎదురైంది. ఇది లావుంటే.. దేశవ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. అయితే.. ఏపీలోని నాలుగు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో జనసేన 1, టీడీపీ 3 దక్కించుకున్నాయి.