'కొత్తవి' భయపెడుతున్నాయ్.. ఏం చేద్దాం?
తెలంగాణలో ప్రధానంగా రెండు సమస్యలు సర్కారును ఇబ్బందిలోకి నెడుతున్నాయి. 1) కొత్త పింఛన్లు. 2) కొత్త ఫీజు రీయింబర్స్‌మెంటు.
తెలంగాణలో ప్రధానంగా రెండు సమస్యలు సర్కారును ఇబ్బందిలోకి నెడుతున్నాయి.
1) కొత్త పింఛన్లు.
2) కొత్త ఫీజు రీయింబర్స్‌మెంటు.
ఈ రెండు విషయాలు కూడా ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పించను ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. అలానే.. రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. దీనిలో రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారు తప్ప.. కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు.
ఇప్పుడు జిల్లాలు, నియోజకవర్గాల్లో అధికారులు, మంత్రులకు నూతన పింఛన్ల వ్యవహారమే ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సానుకూలంగా స్పందన రాలేదని కలెక్టర్లు చెబుతున్నారు. ఇక, నాయకులు కొత్త పింఛను కోసం దరఖాస్తు చేస్తున్న వారిని బుజ్జగిస్తున్నారే తప్ప.. మంజూరు చేయ లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క జిల్లాలో ఎంతగా ఫిల్టర్ చేసి పింఛన్లు ఇవ్వాలని అనుకున్నా.. 30 - 40 వేల మంది కనిపిస్తున్నారు.
చిత్రం ఏంటంటే.. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులే ఉన్నారని సమాచారం. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత లేదన్నా కొత్త పింఛను కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్య 5-7 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వీరికి ఇవ్వాలంటే.. ఖజానా ఖాళీ అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయినా.. ఇప్పటి వరకు ఒక్క పింఛను కూడా మంజూరు చేయక పోవడం గమనార్హం. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
దీంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంటు వ్యవహారం కూడా సర్కారుకు ఇబ్బందిగానే మారింది. ఈ ఏడాది కొత్తగా మరో లక్ష మంది విద్యార్థులు కాలేజీల్లో చేరడంతో వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, ఆమేరకు సర్కారు దగ్గర నిధులు లేవని.. మరింత కాలం ఎదురు చూడాలని అధికారులు, నాయకులు కూడా చెబుతున్నారు. ``ఇప్పటికిప్పుడు ఏదీ జరిగిపోదు. కొంత సమయం పడుతుంది`` అని ఓ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. సో.. దీనిని బట్టి.. అటు పింఛన్లు, ఇటు ఫీజు రీయింబర్స్‌మెంటు వ్యవహారం కూడా స్థానికంగా చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.