కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళన : ఉప ప్రధానిగా అమిత్ షా? కీలక పదవిలో పురందేశ్వరి
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కన్నా ముందుగానే కేబినెట్ విస్తరణ ఉంటుందని సంకేతాలు అందుతున్నాయని చెబుతున్నారు.
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కన్నా ముందుగానే కేబినెట్ విస్తరణ ఉంటుందని సంకేతాలు అందుతున్నాయని చెబుతున్నారు. ఎన్డీఏ 4.0 సర్కారే లక్ష్యంగా మార్పులు చేర్పులు ఉంటాయని, ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రమోషన్ ఇచ్చి ఉప ప్రధాని చేస్తారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అదే సమయంలో కొందరు మంత్రులను తప్పించి గవర్నర్లుగా పంపనున్నారని చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం కూడా ఢిల్లీ వీధుల్లో గట్టిగానే వినిపిస్తోంది. దీంతో కేబినెట్ కూర్పు ఎలా ఉండనుందనేది హాట్ టాపిక్ అవుతోంది.
ఉప ప్రధానిగా అమిత్ షా
ప్రధాని మోదీ కేబినెట్ లో తొలిసారిగా ఉప ప్రధానిని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తనకు అత్యంత నమ్మకస్తుడైన హోంమంత్రి అమిత్ షాకు ఉప ప్రధాని బాధ్యతలు అప్పగించాలని పీఎం మోదీ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని అంటున్నారు. అందుకు ఇదే సరైన సమయంగా ప్రధాని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికి మూడుసార్లు ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకుంటే, ఆయన కేబినెట్లో హోంమంత్రిగా అమిత్ షా అత్యంత కీలకభూమిక పోషిస్తున్నారు. ఇక ఆయనకు ఉప ప్రధానిగా ప్రమోషన్ ఇవ్వడమే కాకుండా, భావి ప్రధాని అన్న సంకేతాలు ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచనగా ఉందని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
పురందేశ్వరికి మంత్రి పదవి
త్వరలో చేపట్టే కేబినెట్ విస్తరణలో ఏపీ నుంచి రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి మంత్రి పదవి దక్కడం ఖాయమని అంటున్నారు. యూపీఏ హయాంలో మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసి పార్టీకి ఎన్నడూ దక్కని విజయాన్ని అందించారు. 2024లో మోదీ 3.0 సర్కారు ప్రమాణం చేసిన సమయంలోనే పురందేశ్వరికి మంత్రిగా అవకాశం ఇవ్వాలని భావించినా, సంఘ్ నేపథ్యం లేకపోవడంతో అప్పట్లో అడ్డంకులు ఎదురయ్యాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం, కేబినెట్ లో మహిళల కోటా పెంచాలని నిర్ణయించింది. దీంతో సమర్థురాలిగా పేరున్న పురందేశ్వరికి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. ప్రధాని మోదీ సైతం ఇదే విధమైన ఆలోచనతో ఉన్నారని అంటున్నారు.
ఎవరు అవుట్.. ఎవరు ఇన్?
ఇక కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా ప్రస్తుతం ఉన్న పలువురు సీనియర్ మంత్రులను తప్పించి, గవర్నర్లుగా లేదా పార్టీ బాధ్యతల్లోకి మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల తీవ్రవిమర్శలు ఎదుర్కొన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి పదవీగండం ఉందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా హర్దీప్ సింగ్ పురీ, పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రను కూడా మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్థిక మంత్రిగా అత్యంత కీలక బాధ్యతలు చూస్తున్న నిర్మలా సీతారామన్ మంత్రిత్వ శాఖలో మార్పులు ఉండే అవకాశం ఉందని, ఆమెకు విద్యాశాఖను అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. నిర్మలా స్థానంలో ఆర్థిక మంత్రిగా మాజీ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
అంతేకాకుండా, బీజేపీలో విలీనమైన పార్టీల నేతలకు, ఇతర పార్టీల నుంచి ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న వారికి కూడా కేబినెట్‌లో స్థానం కల్పించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులను సులభంగా ఆమోదింపజేసుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ సమగ్ర ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీలలో ఒకరిద్దరికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అదే సమయంలో శివసేన (యూబీటీ) నుంచి ఏకనాథ్ షిండే వర్గంలో చేరిన ఎంపీలు, ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు.