బీఆర్ఎస్‌కు దూరం: మల్లారెడ్డి మనసు మారుతోందా?
అంతే కాదు.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మల్లారెడ్డి టచ్‌లో ఉండడాన్ని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.
`'.. పాలమ్మినా..'' అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించి అందరినీ ఆకట్టుకునే మేడ్చల్ ఎమ్మె ల్యే, విద్యా వ్యాపారవేత్త మల్లారెడ్డి బీఆర్ఎస్ కు దూరమవుతున్నారా? లేక, బీఆర్ఎస్ పార్టీనే ఆయనకు దూరంగా ఉంటోందా? అనేది చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేగా ఆయన వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు, కలుస్తున్న నాయకుల వంటి వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్రుగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అంతే కాదు.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మల్లారెడ్డి టచ్‌లో ఉండడాన్ని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు మాసాలుగా మల్లారెడ్డి తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ ఎస్ నాయకులతోపాటు ఆ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలకు కూడా మల్లారెడ్డి దూరం గా ఉంటున్నారు. గత నెల రోజులుగా కేటీఆర్ సహా హరీష్‌రావులు రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. రైతుల సమస్యలపై ఆరా తీశారు.
పొరుగునే మేడ్చల్ నియోజకవర్గం ఉన్నా.. కేటీఆర్ కానీ, హరీష్‌రావు కానీ, మల్లారెడ్డి గురించి ఆరా తీయలేదు. ఇక, పార్టీ పెద్ద నాయకులు వచ్చారు కాబట్టి.. తాను వెళ్లి కలుద్దామని మల్లారెడ్డి కూడా భావించలేదు. ఇక, పార్టీ పరంగా నియోజకవర్గంలో చేపట్టే కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు. ఇటీవల కాలంలో ప్రైమ్ షోలలో పాల్గొనడం.. తన నియోజకవర్గానికి దూరంగా ఉండడం కూడా.. బీఆర్ ఎస్ నుంచి ఆయన బయటకు వచ్చే సంకేతాలు ఇస్తున్నట్టేనని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకొంటానని మల్లారెడ్డి ప్రకటించారు. అక్కడితో ఆగకుండా.. తన కుటంబంలోని ఐదుగురికి టికెట్లు ఇవ్వాలని కూడా ఆయన కోరినట్టు సమాచారం. దీనికి కేసీఆర్ ససేమిరా అన్నారని, అప్పటి నుంచే మల్లారెడ్డి మనస్తానికి గురై.. పార్టీకి దూరంగా ఉంటున్నారన్న టాక్ వినిపి స్తుండడం గమనార్హం మరోవైపు.. మేడ్చల్ విషయంపై బీఆర్ఎస్ కూడా మౌనంగా ఉంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి మల్లారెడ్డి రాజకీయాలకు దూరమవుతారని కొందరు... కాదు త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరతారని మరికొందరు చెబుతున్నారు.