మాజీ నెచ్చెలి ఎఫెక్ట్: హోటల్ అమ్మేస్తున్న ట్రంప్!
ప్రేమ కోసం ఎంతకైనా తెగించే ప్రియుల మాదిరిగానే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తెగించలేదు కానీ, అమెరికా ఫెడరల్ కోర్టే ఆయనతో తెగించేలా చేస్తోందని వార్తలు వస్తున్నాయి
ప్రేమ కోసం ఎంతకైనా తెగించే ప్రియుల మాదిరిగానే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తెగించలేదు కానీ, అమెరికా ఫెడరల్ కోర్టే ఆయనతో తెగించేలా చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ట్రంప్ మాజీ నెచ్చెలి జీన్ క్యారెల్.. వేసిన కేసులో ట్రంప్ అడ్డంగా బుక్కయ్యారు. తనపై లైంగిక దాడి చేయడంతో పాటు.. అనంతరం.. తనను దూషించారని పేర్కొంటూ ఆమె కోర్టును ఆశ్రయించిన కేసులో ట్రంప్‌కు భారీ ఎదురు దెబ్బతగిలింది.
క్యారెల్‌కు 5 మిలియన్ డాలర్ల సొమ్మును 2023 నుంచి వడ్డీ లెక్కించి మరీ చెల్లించాలని ఫెడరల్ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. అయితే.. అంత సొమ్ము తన వద్దలేదని మరో సూట్ వేయడంతో కోర్టు మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో చేసేది లేక, ప్రత్యామ్నాయ మార్గం కనిపించక.. డకోటా(రాష్ట్రం)లోని తన పాత హోటల్‌ను ట్రంప్ అమ్మకానికి పెట్టారని అమెరికా మీడియా పేర్కొంది. అయితే... పెనాలిటీ వార్త నిజమేనని..కానీ, ట్రంప్ హోటల్‌ను విక్రయించేందుకు సిద్ధమయ్యారన్నదానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదని తెలుస్తోంది.
అసలు ఏం జరిగింది?
1995-96 మధ్య క్యారెల్-ట్రంప్ మధ్య స్నేహం చిగురించింది. అప్పట్లో రియల్ ఎస్టేట్ సహా.. హోటల్ బిజినెస్‌లో ఉన్న ట్రంప్‌కు క్యారెల్ మద్దతుగా నిలిచారు. తాను రాసే కాలమ్స్ ద్వారా ట్రంప్ వ్యాపారాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా.. కొనసాగుతున్న వీరి స్నేహంలో ఓ రోజు అకస్మాత్తుగా ట్రంప్ ఆమెపై లైంగిక దాడి చేశారన్నది క్యారెల్ రాసిన ఓ పుస్తకంలో ఉంది. దీనిని ఆమె అభిమానులు 2021లో వెలుగులోకి తీసుకువచ్చారు.
అనంతరం.. ఈ విషయంపై స్పందించిన ట్రంప్.. `క్యారెల్ ఓ వ్యభిచారి. సంపన్నులను ఇలానే బుట్టలో వేసుకుంటుంది. వారి నుంచి డబ్బులు గుంజుతుంది.` అని తన నోటికి ఇష్టం వచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో మంటెత్తిన క్యారెల్ అప్పట్లో కేసు పెట్టారు. అనేక విచారణల అనంతరం.. 2023లో కోర్టు తీర్పు ఇచ్చింది. క్యారెల్‌కు 5 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో 48 కోట్లు) పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. దీనిపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అనేక విచారణల అనంతరం.. గత తీర్పును సమర్థించింది. దీంతో ట్రంప్ ఇప్పుడు వడ్డీతో సహా క్యారెల్‌కు నగదు చెల్లించాల్సి వచ్చింది.