మహేష్, పొన్నం.. సహా కీలక నేతల అరెస్టు.. రీజనేంటి?
వచ్చే నెల 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చింది.
తెలంగాణలో ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, గణేష్ సహా..పలువురు ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునివ్వనున్న ట్టు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మరోవైపు.. అరెస్టు చేసిన వారిపై కేసులు నమోదు చేయబోమని పోలీసులు తెలిపారు.
ఎందుకు?
వచ్చే నెల 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని.. అలానే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ.. సర్‌ను రద్దు చేయాలన ఇడిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో నవంబరు 1న ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ఇండియా కూటమి పార్టీల నాయకులు కూడా సన్నాహాలు చేస్తున్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ కార్యకర్తలు.. సర్‌ను వ్యతిరేకించే వారిని ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు., నిరసనలో పార్టిసిపేట్ చేసేలా చూసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సర్వం సిద్ధం చేసింది. తమకు 5 ప్రత్యేక రైళ్లను కేటాయించా లని దక్షిణ మధ్య రైల్వే జీఎంను కాంగ్రెస్ పీసీసీ చీఫ్ కోరారు. అయితే.. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పైగా.. ప్రస్తుతం దీపావళి పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను కేటాయించలేమని పరోక్షంగా సమాచారం పంపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు.. బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయాన్ని ముట్టడించారు.
రైల్వే నిలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలతో కలిసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్ , శ్రీ గణేష్,కార్పొరేషన్ చైర్మన్లు , కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా.. నవంబర్ 1 వ తేదీన ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు రైళ్లు కేటాయించకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా అడ్డుకుంటున్నారని మహేష్ విమర్శలు గుప్పించారు.