ఆన్లైన్లో లిక్కర్ బుకింగ్ చేసుకో.. షాపుకొచ్చి తీసుకో.. ఎక్కడ తాగాలో అడక్కు..
సాధారణంగా డిజిటల్ ఇండియా మహిమ వల్ల ఇంట్లో కూర్చుని ఒక్క క్లిక్ కొడితే వేడి వేడి బిర్యానీ గుమ్మం ముందుకు వస్తుంది.
దేశ రాజధానిలో టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది.. ఫుడ్ కావాలంటే స్విగ్గీ, జొమాటో.. బట్టలు కావాలంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. మరి మద్యం బాటిల్ కావాలంటే? 'యాప్‌లో ఆర్డర్ వేసుకో.. షాపుకెళ్లి బాటిల్ తెచ్చుకో' అంటున్నారు ఢిల్లీ సర్కారు పెద్దలు.
అవును మీరు విన్నది నిజమే.. ఢిల్లీలో లిక్కర్ ప్రియుల కోసం ప్రభుత్వం ఒక 'విప్లవాత్మక' డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చింది. మద్యం షాపుల ముందు క్యూలో నిలబడే కష్టాలకు చెక్ పెడుతూ స్మార్ట్‌ఫోన్ ద్వారానే బాటిల్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. అయితే ఇక్కడే ఒక చిన్న.. కాదు కాదు.. చాలా పెద్ద 'ట్విస్ట్' ఉంది. ఆర్డర్ ఆన్లైన్లోనే కానీ డెలివరీ మాత్రం మీ సొంత కాళ్ల మీదే..
డిజిటల్ ఆర్డర్.. ఫిజికల్ వాకింగ్
సాధారణంగా డిజిటల్ ఇండియా మహిమ వల్ల ఇంట్లో కూర్చుని ఒక్క క్లిక్ కొడితే వేడి వేడి బిర్యానీ గుమ్మం ముందుకు వస్తుంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం "అంత సుఖపడితే ఎలా? డిజిటల్ సౌకర్యంతో పాటు కాస్త శారీరక శ్రమ కూడా ఉండాలిగా" అని ఆలోచించినట్లుంది. అందుకే యాప్‌లో బ్రాండ్ ఎంపిక, ఆన్లైన్ పేమెంట్ వరకు డిజిటల్ ఛాన్స్ ఇచ్చి చివరికి బాటిల్ పట్టుకోవాలంటే మాత్రం "నడుచుకుంటూ షాపు దాకా రావాల్సిందే" అని నిబంధన పెట్టారు. దీంతో మందుబాబులు "ఇంతకీ ఇది ఆన్లైన్ షాపింగా? లేక షాపునకు వెళ్లేందుకు రూట్ మ్యాపా?" అని తలలు పట్టుకుంటున్నారు.
48 గంటల డెడ్‌లైన్.. మిస్సైతే అంతే సంగతులు
ఈ కొత్త విధానంలో మరో రసవత్తరమైన అంశం ఏంటంటే.. యాప్‌లో పేమెంట్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. 48 గంటల గడువు విధించారు. ఆ లోపే పరుగెత్తుకుంటూ వెళ్లి షాపులో బాటిల్ కలెక్ట్ చేసుకోవాలి. గడువు దాటిందో.. మీ డబ్బులు.. మీ బాటిల్ సంగతి దేవుడికే ఎరుక!
ప్రస్తుతానికి ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని 208 దుకాణాల్లో ఈ వినూత్న సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ యాప్‌లోకి ఎంట్రీ ఇవ్వాలంటే కనీసం 25 ఏళ్ల వయసు ఉండాలి. అంటే 'పాస్' కావడానికి వయసు కావాలి.. బాటిల్ చేతికి రావడానికి నడక కావాలి.
మందుబాబుల సందేహాలు.. క్యూలు తగ్గుతాయా?
ఈ విచిత్రమైన కాంబినేషన్ చూసి వినియోగదారుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాప్‌లో ఆర్డర్ చేసి, షాపుకెళ్లాక "స్టాక్ అయిపోయింది" అంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ కాన్సిల్ చేసుకోవాల్సి వస్తే రిఫండ్ ఎప్పుడు వస్తుంది? క్యూలు తగ్గడం సంగతి దేవుడెరుగు.. షాపు వద్ద కలెక్షన్ కౌంటర్ల దగ్గర మళ్లీ కొత్త క్యూలు మొదలవుతాయా? అన్నవే మందుబాబులకు వస్తోన్న డౌట్లు..
టెక్నాలజీని వాడి క్యూలను నివారించాలన్న ప్రభుత్వ ప్రయత్నం మెచ్చుకోదగినదే. కానీ "ఇంటికొచ్చి ఇచ్చే డెలివరీ లేనప్పుడు ఈ ఆన్లైన్ బుకింగ్ హడావుడి ఎందుకు బాసూ?" అని ఢిల్లీ లిక్కర్ లవర్స్ నిట్టూరుస్తున్నారు. డిజిటల్ యుగంలో ఉన్నా చివరికి మద్యం బాటిల్ కావాలంటే షాపు మెట్లు ఎక్కాల్సిందేనని ఈ కొత్త విధానం నిరూపిస్తోంది.