మోడీ వారణాసిలో సమాజ్వాదీ పార్టీ విజయం.. యూపీలో ఏం జరుగుతోంది?
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికలంటే ఇప్పటివరకూ ఓటమి ఎరుగని మోడీకి కూడా ఆ ఓటమి పాఠాలు నేర్పేలా ఉంటాయి.
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికలంటే ఇప్పటివరకూ ఓటమి ఎరుగని మోడీకి కూడా ఆ ఓటమి పాఠాలు నేర్పేలా ఉంటాయి. కాలం, ఓటర్లు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. ఇప్పటివరకూ చేసిన ప్రతీ పోటీలో గెలిచిన మోడీజీ.. తన నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీని గెలిపించలేకపోయారు. నిజంగా నిజమిదీ.. ఈ అనూహ్య ఫలితం రాబోయే యూపీ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా? సమాజ్ వాదీ యూపీలో పుంజుకుంటుందా? ఈ ఫలితం ఎలాంటి మెసేజ్ పంపుతున్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
నరేంద్ర మోదీ అనే పేరు వినగానే రాజకీయాల్లో ఒక అజేయమైన కోట గుర్తుకొస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక రాజధాని.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ‘వారణాసి’ అంటే బీజేపీకి ఓ పటిష్టమైన రాజకీయ రక్షణ కవచం. కానీ అదే కోట గోడల్లో ఇప్పుడు ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) విజయనగారాన్ని మోగించింది. వారణాసి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్ వరుసగా రెండోసారి చారిత్రాత్మక విజయం సాధించడం.. ఆగ్రాలోనూ ఎస్పీ జెండా ఎగరడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భావోద్వేగపూరితమైన కొత్త చర్చకు తెరలేపాయి.
విద్యావంతులు, ఉపాధ్యాయులు వంటి మేధావి వర్గం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక ఓటు మాత్రమే కాదు.. సమాజంలోని అక్షరాస్య వర్గం మార్పును కోరుకుంటోందనడానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ప్రతిపక్షం జయకేతనం ఎగరవేయడం ఎస్పీ శ్రేణులలో నింపిన ఉత్సాహం సామాన్యమైనది కాదు.
అయితే ఈ విజయం వెనుక ఉన్న అసలు సత్యాలు, వైరుధ్యాలు కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఒకవైపు వారణాసి, ఆగ్రాల్లో ఎస్పీ గెలిచి తన ఉనికిని చాటుకుంటే.. మరోవైపు మీరట్, బరేలీ-మొరాదాబాద్, లక్నో స్థానాల్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంది. దీంతో యూపీలో ఏ ఒక్క పార్టీ ప్రభావమూ ఏకపక్షంగా లేదని.. క్షేత్రస్థాయిలో హోరాహోరీ పోరు సాగుతోందని స్పష్టమవుతోంది.
ఇది కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు. పొరుగునే ఉన్న కర్ణాటకలో అధికార కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. బెంగళూరు టీచర్స్ స్థానంతో సహా మొత్తం నాలుగు ఎమ్మెల్సీ సీట్లను బీజేపీ-జేడీఎస్ కూటమి కైవసం చేసుకుని అధికార పక్షానికి గట్టి జలక్ ఇచ్చింది.
రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్ కాకపోవచ్చు. పరిమిత ఓటర్లుండే ఈ ఎన్నికల ఫలితాలతోనే యూపీలో అధికారం చేతులు మారిపోతుందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. అయినప్పటికీ మోదీ కంచుకోటలోనే ఎస్పీ సాధించిన ఈ గెలుపు.. రాబోయే రోజుల్లో అధికార బీజేపీకి క్షేత్రస్థాయిలో కఠినమైన సవాళ్లు ఎదురుకాక తప్పవనే పదునైన హెచ్చరికను మాత్రం స్పష్టంగా పంపింది.