ఫ్రీ బస్సులో వెళ్లిపోయిన భార్య.. రూ.2 వేలు ఖర్చు.. భర్తకు చుక్కలు!
తెలంగాణ ప్రభుత్వం ‘మహాలక్ష్మీ పథకం’లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో కోట్లాది మంది ఇల్లాళ్లకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించింది.
"భార్య అలిగితే ఒకప్పుడు లగేజ్ సర్దేవారు.. ఇప్పుడు నేరుగా ఫ్రీ బస్సే ఎక్కుతున్నారు" తెలంగాణలో ఉచిత బస్సు పథకం మహిళలకు ఎంత లబ్ధి చేకూరుస్తుందో తెలీదు కానీ భర్తలకు మాత్రం కొత్త టెన్షన్లు తెచ్చిపెడుతోంది. చిన్న గొడవకే ఉచిత బస్సెక్కి అలిగి వెళ్లిపోయిన భార్యను వెతకబోయి ₹2,000 జేబులోంచి ఊడ్చేసుకున్న ఓ అమాయక భర్త ఆవేదన ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ‘మహాలక్ష్మీ పథకం’లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో కోట్లాది మంది ఇల్లాళ్లకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించింది. బంధువుల ఇళ్లకు వెళ్లాలన్నా.. షాపింగ్ చేయాలన్నా రూపాయి ఖర్చు లేకుండా జర్నీ చేసేస్తున్నారు. అయితే ఈ ‘ఫ్రీ’ ప్రయాణం ఒక భర్త జేబుకు మాత్రం ఊహించని రీతిలో భారీ చిల్లు పొడిచింది. భార్యాభర్తల మధ్య వచ్చిన ఒక చిన్న గొడవ.. ఆ తర్వాత భార్య ఉచిత బస్సు ఎక్కి వెళ్లిపోవడం.. ఆమె ఆచూకీ కోసం భర్త రూ.2 వేలు ఖర్చుపెట్టాల్సి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. జనం నోళ్లలోనూ నవ్వులు పూయిస్తోంది.
అసలేం జరిగింది?
సిద్దిపేట జిల్లా రేగులపల్లిలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో ‘ప్రజల వద్దకు ఎమ్మెల్యే’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఊరి సమస్యలు, పథకాల లబ్ధి గురించి చర్చ జరుగుతుండగా ఓ బాధితుడు మైక్ ముందుకు వచ్చి తన ఆవేదనను వెళ్లగక్కాడు.
సదరు భర్తగారికి ఇటీవల భార్యతో చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. పూర్వకాలంలో ఐతే ఆలుమగల గొడవలు రాగానే ఆటో ఛార్జీలు, బస్సు టికెట్ ధరలు గుర్తుకొచ్చి కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉండేదేమో.. కానీ ఇప్పుడు అలా కాదే.. రవాణా సౌకర్యం లక్ష్మీదేవిలా 'ఫ్రీ'గా అందుబాటులో ఉంది. ఇంకేముంది? అమ్మగారు క్షణాల్లో అలకపాన్పు దిగి సరాసరి బస్ స్టాండ్ చేరుకున్నారు. ఉచిత బస్సు ఎక్కి ఏ ఊరో వెళ్లిపోయారు.
భార్యకు ఫ్రీ.. భర్తకు రూ. 2,000 ఖర్చు
భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో కంగారుపడ్డ మన కథానాయకుడు ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక ఊరంతా వెతకడం మొదలుపెట్టాడు. ఆ బస్సు ఎక్కి ఈ ఆటో మారి చివరకు ఆమె ఆచూకీ కనుక్కొని ఇంటికి తెచ్చేసరికి ఆయన జేబులో రూ.2,000 హుష్ కాకి అయ్యాయి. భార్య జర్నీ ఫ్రీగా సాగిపోతే ఆమెను వెతికే క్రమంలో ఈ భర్తకు మాత్రం ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి.
ఎమ్మెల్యే సభలో ఈ విషయాన్ని చెబుతూ.. ‘‘ఫ్రీ బస్సు పెట్టి అంతా ఆగం చేశారు సార్.. ఆవిడేమో ఫ్రీగా బస్సెక్కి పోయింది, నేను ఆమెను వెతికి పట్టుకోవడానికి రెండవేలు తగలేశా’’ అంటూ ఆయన అమాయకంగా చేసిన సెటైరికల్ వ్యాఖ్యలు అక్కడ ఉన్నవారందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి.
ఈ ఘటన విన్న తర్వాత చాలామంది భర్తల్లో సరదా భయం మొదలైంది. ‘ఇకపై భార్యతో గొడవ పడేముందు కాస్త జాగ్రత్తగా ఉండాలిరా బాబోయ్.. మనం అలక తీర్చడం ఒకెత్తయితే ఉచిత బస్సుల్లో ఏ జిల్లాకు వెళ్లిందో వెతుక్కోవడం ఇంకో ఎత్తు’ అని కామెంట్లు చేసుకుంటున్నారు.
మహిళల సాధికారతకు ఫ్రీ బస్సు ఎంతో దోహదపడుతున్నా.. కుటుంబంలో జరిగే చిన్న చిన్న అలకల వేళ ఈ పథకం భర్తల జేబులకు ఇలా ఖరీదైన అనుభవాలను మిగులుస్తుండటం విశేషం. మొత్తానికి ‘బస్సు ప్రయాణం ఫ్రీ కావచ్చు.. కానీ అలిగిన భార్యను వెతకడం మాత్రం ఫ్రీ కాదు’ అని ఈ ఘటన నిరూపించింది.