11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

ఈ దేశంలో బతికున్న చచ్చినట్లే అన్నది సామాన్యుడి వేదన. ఎందుకంటే ఆసుపత్రులకు రోగం వచ్చి పోతే అక్కడ వారు జీవచ్చవాన్ని చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి.

Update: 2026-10-28 03:36 GMT

ఈ దేశంలో బతికున్న చచ్చినట్లే అన్నది సామాన్యుడి వేదన. ఎందుకంటే ఆసుపత్రులకు రోగం వచ్చి పోతే అక్కడ వారు జీవచ్చవాన్ని చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. మందుల ధరలు చూస్తే ప్రభుత్వాల నియంత్రణలో లేకుండా దోపిడీదారులకు వరాలుగా మారుతున్నాయి. వికృత విచిత్ర పరిస్థితి మీద ఒక పిటిషనర్ కోర్టుకెక్కారు. ప్రాణాంతక వ్యాధుల విషయంలో మందుల ధరలను వందల రెట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్న డ్రగ్స్ మాఫియా మీద పాలకుల చర్యలు ఏవీ అన్నది సగటు జీవి ప్రశ్న అయితే సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం మీద కేంద్ర ప్రభుత్వాన్ని సూటింగానే ప్రశ్నించింది.

ఇదేనా నియంత్రణ :

సుప్రీం కోర్టులో ప్రాణాంతక వ్యాధుల మందుల ధరల బాదుడు మీద దాఖలు అయిన పిటిషన్ పై తాజాగా విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మెడికల్ డిస్ట్రిబ్యూటర్ భార్య క్యాన్సర్ చికిత్స పొందుతున్నప్పుడు జరిగిన సంఘటనను కూడా కోర్టు ఉదహరించింది. తానే స్వయంగా డీలర్‌ అయిన వ్యక్తి ఈ కీమోథెరపీ ఇంజెక్షన్ ఆయనకు డీలర్ ధర ప్రకారం 11 వేలకే వస్తూంటే ఆయన భార్యకు మాత్రం ఒక ఆసుపత్రి యాజమాన్యం అదే ఇంజెక్షన్‌కు 1,30,000 వసూలు చేసింది. తాను ఇచ్చిన ఇంజెక్షన్ ని వాడాలని ఆ వ్యక్తి కోరినా ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించింది. ఇలా బరితెగించి మరీ మందుల దోపిడీ చేస్తున్న వైనాన్ని కేంద్రం దృష్టికి కోర్టు తీసుకుని వచ్చింది.

ఏమి జరుగుతోంది :

భారీ ధరలకు అది కూడా వందల రెట్లు రేట్లు పెంచి విక్రయించడం పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రైవేట్ ఆసుపత్రులను తప్పుపట్టింది. మంగళవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని దోపిడీ చేస్తారా అని ఆసుపత్రులు చేస్తున్న ఈ దోపిడీ మీద మండిపడింది. ఆసుపత్రులు మనుగడ సాగించడానికి వేరే మార్గాలు చూసుకోవాలి కానీ లాంటి దోపిడీ ద్వారా కానే కాదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎందుకింత తేడా వస్తోంది :

ఈ రకంగా సామాన్యుడి మీద సాగుతున్న దోపిడీని ఎలా సమర్ధించుకుంటారని కోర్టు ప్రశ్నించింది. ఒక ఇంజెక్షన్ ధర డీలర్ దగ్గర ఒక రేటు ఉంటే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల దగ్గర వందల రెట్లు అధికంగా ఉండడం ఏంటని కోర్టు నిలదీసింది. అసలు ఇంతటి భారీ వ్యత్యాసం ఎందుకు వస్తోంది అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది లూటీతో సమానం కాదా అని కూడా అంటూ ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతోందని నిలదీసింది. ఇక దేశంలో మందుల ధరల నియంత్రణ సరిగ్గా లేదంటూ సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.

దీని వెనక మతలబు ఏంటి :

అంతే కాదు దేశంలో మెజారిటీ అత్యవసర మందులు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ పరిధిలోకి రాకపోవడం ఏమిటి అని కూడా ప్రశ్నించింది. క్యాన్సర్ మందుల ధరల నియంత్రణపై కేంద్రం తీసుకుంటున్న చర్యల జాప్యంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఈ వ్యవహారంపై పూర్తి వాదనలు విన్న సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మొత్తం మీద చూస్తే కొన్ని మందులు మాత్రమే డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ పరిధిలోకి తెస్తున్నారు. ప్రాణాంతర వ్యాధుల మందులు మాత్రం ఆ జాబితాలో ఉండటం లేదు, దీని వెనక మతలబు ఏంటి అన్నది సుప్రీంకోర్టు వ్యాఖ్యల తరువాత అంతా చర్చించుకునే పరిస్థితి ఉంది.

Tags:    

Similar News