మున్సిపల్ ఎన్నికలపై మరింత స్పష్టత.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సుప్రీంకోర్టు మరింత జోష్ ఇచ్చింది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సుప్రీంకోర్టు మరింత జోష్ ఇచ్చింది. కొన్ని మున్సిపాలిటీల్లో విలీన పంచాయతీలపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వెలిబుచ్చింది. తమ తుది తీర్పుకు లోబడి విలీన పంచాయతీలపై నిర్ణయం తీసుకోవాలని, మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ విషయం స్పష్టం చేయాలని సూచించింది. దీంతో సమీప గ్రామాలను విలీనం చేసిన మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న మీమాంస తొలగిపోయింది. రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తప్ప మిగిలిన అన్ని మున్సిపాలిటీల ఎన్నికలకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు.
రాష్ట్రంలో కొన్ని గ్రామాలను మున్సిపాలిటీల్లో ఏకపక్షంగా విలీనం చేశారంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు లేదా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు బుధవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. మున్సిపాలిటీలలో గ్రామాల విలీన ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా.. పిటిషనర్లు ఎద్దుల సుబ్బారెడ్డి, వల్లేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం తరఫున సీనియర్ న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ వాదనలు వినిపించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అదే సమయంలో, మున్సిపాలిటీలలో గ్రామాల విలీన ప్రక్రియ మొత్తం తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించి ఏకపక్షంగా జీవోలు జారీ చేశారనేది పిటిషనర్ల ప్రధాన ఆరోపణగా ఉంది. గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే సమయంలో స్థానిక గ్రామ పంచాయతీల తీర్మానాలు, గ్రామస్థుల అధికారిక ఆమోదం తీసుకోలేదని వారు సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకపోవడం వల్ల స్థానిక స్వపరిపాలన హక్కులు దెబ్బతింటాయని, అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి కీలకమైన గ్రామీణ సంక్షేమ పథకాలను కోల్పోవాల్సి వస్తుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు పట్టణాల విస్తరణ, జనాభా ప్రాతిపదికన అభివృద్ధి పనులను వేగవంతం చేసే ఉద్దేశంతోనే చట్టానుసారంగా ఈ విలీన ప్రక్రియను చేపట్టామని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం, విలీన ప్రక్రియ అంతా తుది తీర్పునకు లోబడి ఉంటుందని తేల్చిచెప్పింది.