సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
| లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జర్మనీ మహిళ, ఢిల్లీకి చెందిన న్యాయవాది మధ్య కుమారుడి కస్టడీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నాలుగేళ్ల బాలుడి తాత్కాలిక కస్టడీని తల్లికి అప్పగిస్తూ సింగపూర్ తీసుకెళ్లేందుకు అనుమతించింది. అయితే తండ్రికి రోజూ వీడియో కాల్ అవకాశం కల్పించాలని, రూ.కోటి డిపాజిట్ చేయాలని, ఇతర షరతులు పాటించాలని ఆదేశించింది. బిడ్డ సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేసింది.
కాలం మారుతోంది.. మనుషుల ఆలోచనలు.. జీవనశైలి మారుతున్నాయి. ఒకప్పుడు మూడు ముళ్లు.. ఏడడుగుల బంధమే కుటుంబానికి పునాదిగా ఉండేది. కానీ నేటి ఆధునిక సమాజంలో 'లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్' సర్వసాధారణమైపోయాయి. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి కలిసి జీవించడం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ పసిప్రాణానికి జన్మనివ్వడం వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దారులు వేరైనప్పుడే అసలు విషాదం మొదలవుతుంది. పెద్దల అహంకారాలు.. విభేదాల మధ్య ఏ పాపం ఎరుగని ఆ పసిహృదయం నలిగిపోతుంది. సరిగ్గా ఇలాంటి ఓ సున్నితమైన.. భావోద్వేగభరితమైన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
జర్మనీకి చెందిన ఓ మహిళ.. ఢిల్లీకి చెందిన ఓ భారతీయ న్యాయవాది కొంతకాలం పాటు సహజీవనం చేశారు. వివాహ బంధంతో ఒక్కటి కాకపోయినా 2022లో వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఒక పండంటి మగబిడ్డ జన్మించాడు. తల్లి సింగపూర్‌లోని ఓ ప్రముఖ సంస్థలో ఉన్నత ఉద్యోగంలో స్థిరపడగా.. తండ్రి ఢిల్లీలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొన్నాళ్ల పాటు ఎంతో ఆనందంగా సాగిన వీరి ప్రయాణంలో విభేదాల మేఘాలు కమ్ముకున్నాయి. దాంతో నాలుగేళ్ల చిన్నారి ఎవరి దగ్గర ఉండాలనే ప్రశ్న తలెత్తింది. తండ్రి తన బిడ్డను తనకు దూరం చేస్తున్నాడంటూ తల్లి.. బిడ్డ శాశ్వత సంరక్షణ తనకే కావాలంటూ తండ్రి కోర్టు మెట్లెక్కారు.
ఈ న్యాయపోరాటంలో తండ్రి.. తల్లి మానసిక ఆరోగ్యంపై కొన్ని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి తల్లిదండ్రులతో పాటు ఆ చిన్నారికి కూడా బెంగళూరులోని ప్రఖ్యాత నిమ్హాన్స్ నిపుణులతో మానసిక పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఆ పరీక్షల్లో తల్లిదండ్రులిద్దరూ బిడ్డను పెంచడానికి పూర్తి సమర్థులేనని తేలింది. తల్లిపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు నిర్ధారించింది.
జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ అత్యంత మానవీయ కోణంలో స్పందించింది. "తల్లిదండ్రుల మధ్య వివాహ బంధం ఉందా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు.. ఆ పసివాడి భవిష్యత్తు.. సంక్షేమమే అన్నింటికంటే ముఖ్యం" అని తేల్చి చెప్పింది. సింగపూర్‌లో తల్లికి ఉన్న ఉద్యోగ భద్రత.. ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు.. చిన్నారి చదువు కోసం ఆమె వేసుకున్న ప్రణాళికలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తాత్కాలిక కస్టడీని తల్లికే అప్పగిస్తూ బాలుడిని సింగపూర్ తీసుకెళ్లేందుకు అనుమతించింది.
అయితే తల్లికి బిడ్డను అప్పగించినంత మాత్రాన తండ్రి హక్కులను కోర్టు కాలరాయలేదు. ఓ బిడ్డ ఎదుగుదలకు తల్లి లాలన ఎంత అవసరమో తండ్రి భరోసా కూడా అంతే అవసరమని భావించిన ధర్మాసనం తల్లికి కొన్ని కఠినమైన షరతులు విధించింది. తల్లి సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో రూ. కోటి డిపాజిట్ చేయాలి. భారత కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండేలా సింగపూర్ కోర్టు నుంచి మూడు వారాల్లోగా మిర్రర్ ఆర్డర్ తీసుకురావాలి. తండ్రి ప్రతిరోజూ తన కుమారుడితో వీడియో కాల్‌లో మాట్లాడే అవకాశం కల్పించాలి. తండ్రి సింగపూర్ వెళ్లినప్పుడు బిడ్డను కలిసేందుకు సహకరించాలి. అలాగే ఏడు రోజులకు మించి స్కూల్ సెలవులు వస్తే బాలుడిని భారత్‌కు తీసుకురావాలి. తండ్రిపై బిడ్డకు ఎలాంటి వ్యతిరేక భావన కలగకుండా పెంచుతున్నారని నిర్ధారించేందుకు ప్రతి ఆరు నెలలకోసారి నిపుణుల నివేదిక సమర్పించాలి.
ఈ తీర్పులో గెలుపు తల్లిది కాదు.. ఓటమి తండ్రిది అంతకన్నా కాదు.. ఇక్కడ గెలిచింది కేవలం ఆ నాలుగేళ్ల పసివాడి భవిష్యత్తు.. వివాహేతర సంబంధమైనా.. సహజీవనమైనా.. ఒక ప్రాణాన్ని ఈ భూమిపైకి తెచ్చినప్పుడు ఆ బిడ్డకు ప్రేమను.. భద్రతను అందించడం తల్లిదండ్రుల కనీస బాధ్యత. పెద్దల మధ్య బంధాలు తెగిపోవచ్చు.. కానీ బిడ్డతో ఉన్న పేగుబంధం ఎప్పటికీ తెగిపోదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు నేటి తరానికి ఒక గొప్ప కనువిప్పు..