19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

ఆయా మున్సిపాలిటీల్లో తమ నామినేషన్ల దాఖలు చేయడానికి అవకాశం లేకపోయిందని, హింసాత్మక ఘటనలతో నామినేషన్లు వేయలేకపోయామని ప్రతిపక్షం వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Update: 2026-10-21 14:54 GMT

రాష్ట్రంలో 19 మున్సిపాలిటీల ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఆయా మున్సిపాలిటీల్లో తమ నామినేషన్ల దాఖలు చేయడానికి అవకాశం లేకపోయిందని, హింసాత్మక ఘటనలతో నామినేషన్లు వేయలేకపోయామని ప్రతిపక్షం వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఫిర్యాదులు వచ్చిన మున్సిపాలిటీలలో నామినేషన్ల గడువు పెంచే అవకాశాలు పరిశీలించాలని, 24 గంటల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఏంటో చెప్పాలని సూచించింది. కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నామినేషన్లపై ఫిర్యాదులు వచ్చిన 19 మున్సిపాలిటీల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా బుధవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత 19 మున్సిపాలిటీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. అంతవరకు ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తుది జాబితా ప్రకటన నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఫిర్యాదులు అందిన 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు అభ్యర్థుల తుది జాబితాను నిలిపివేయడంతో ఎన్నికల ప్రక్రియపై గందరగోళం నెలకుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించారు. ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సివుంది. సుప్రీం సూచనలతో 19 మున్సిపాలిటీలు తప్ప మిగిలిన చోట్ల తుది జాబితా వెల్లడించారని చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత 19 చోట్ల తుది జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే ఈ నెల 27న జరిగే విచారణ తర్వాతే ఈ మున్సిపాలిటీల ఎన్నికలపై నిర్ణయం ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత జిల్లా కడపలోని కడప నగరపాలక సంస్థతోపాటు ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన నియోజకవర్గ కేంద్రం పుంగనూరుతోపాటు ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు, రాజంపేట, కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో నామినేషన్ల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, తాము నామినేషన్లు దాఖలు చేయలేకపోయామని వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలా మొత్తం 19 చోట్ల వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నామినేషన్ల గడువు పెంచడంతోపాటు వైసీపీ అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించాలని కోరారు.

ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారని చెబుతున్న మున్సిపాలిటీల్లో గడువు తేదీ పొడిగింపును పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. అదేసమయంలో గడువు పొడిగింపునకు అవకాశం కల్పిస్తే జిల్లా కలెక్టరేట్లలో నామినేషన్ సమర్పణకు అవకాశం ఇవ్వాలని సూచించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఫిర్యాదు వచ్చిన మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ వాయిదాకు ఉన్న అవకాశాలను చర్చించారని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోని ఎస్ఈసీ సుప్రీం ఉత్తర్వులు చేతికి అందే వరకు వేచిచూడాలని నిర్ణయించారని చెబుతున్నారు.

Tags:    

Similar News