భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌ల‌కు ఉరిశిక్ష‌లు.. మీరట్‌లో వ‌రుస‌ సంచ‌ల‌న తీర్పుల‌పై చ‌ర్చ‌!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సంచలనం సృష్టించిన `సాంప్‌కాండ్` (అమిత్ కశ్యప్ హత్య కేసు) ఉదంతంలో కోర్టు వెలువరించిన మరణశిక్ష తీర్పుపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగాప్ర‌జ‌ల్లో పెద్ద చ‌ర్చ సాగుతోంది.

Update: 2026-10-16 14:13 GMT

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సంచలనం సృష్టించిన `సాంప్‌కాండ్` (అమిత్ కశ్యప్ హత్య కేసు) ఉదంతంలో కోర్టు వెలువరించిన మరణశిక్ష తీర్పుపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగాప్ర‌జ‌ల్లో పెద్ద చ‌ర్చ సాగుతోంది. సంచ‌ల‌నం సృష్టించిన బ్లూడ్ర‌మ్ మ‌ర్డ‌ర్ కేసులో భ‌ర్త‌ను చంపిన భార్య‌, ప్రియుడికి మ‌ర‌ణ శిక్ష విధించిన అదే మీర‌ట్‌లో ఇప్పుడు మ‌రో అరాచ‌క భార్య‌- ఆమె ప్రియుడికి ఉరిశిక్ష విధించ‌డం సంచ‌ల‌న‌మైంది.

తాజా తీర్పుపై మృతుడు అమిత్ క‌శ్య‌ప్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భర్తను ప్రియుడితో కలిసి అత్యంత క్రూరంగా హతమార్చిన భార్య రవిత.. ఆమె ప్రియుడు అమర్‌దీప్‌లకు కోర్టు మరణశిక్ష విధించడం పై మృతుడి తల్లి మునేశ్ దేవి స్పందిస్తూ.. ఈ తీర్పుతో తన ఆత్మకు శాంతి లభించిందని భావోద్వేగానికి గుర‌య్యారు. తన కొడుకును ఎలాగైతే ఘోరంగా చంపారో.. దోషులు కూడా అదే విధంగా శిక్ష అనుభవించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసులో దోషులు ఒకవేళ దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తే.. తమ కుటుంబం తరఫు నుంచి గట్టిగా న్యాయపోరాటం చేస్తామని మృతుడి సోదరుడు సోను స్పష్టం చేశారు. దోషులకు ఉరిశిక్ష అమలయ్యే వరకు తాము చట్టపరమైన పోరాటాన్ని ఆపేది లేదని.. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. హత్యను కప్పిపుచ్చుకోవడానికి నిందితులు శవం వద్ద సజీవమైన పామును ఉంచి దానిని సహజ మరణంగా లేదా పాము కాటుగా నమ్మించేందుకు చేసిన కుట్రను కోర్టు గుర్తించి సరైన న్యాయం చేసిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అమాయకుడైన తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయి, గత పదిహేను నెలలుగా న్యాయం కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూసిన తమకు ఈ తీర్పు ద్వారా పెద్ద ఊరట లభించిందని కుటుంబీకులు తెలిపారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే దుర్బుద్ధితో భర్త ప్రాణాలు తీసిన భార్యకు పడిన ఈ శిక్ష సమాజంలో తప్పు చేయాలనుకునే వారికి ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొసీడింగ్స్ నిర్వహించింది. ఇరువర్గాల వాదనలు పూర్తిగా ముగిసిన తర్వాత.. నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. సమాజాన్ని కుదిపేసిన ఈ కేసులో అన్ని సాక్ష్యాధారాలు.. వాదనలను పరిశీలించిన కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించింది.

ఈ కేసులో దోషులైన రవిత - అమర్‌దీప్‌లకు మరణశిక్ష (ఫాసీ) విధించాలంటూ మీరట్ ప్రాంతానికి చెందిన వకీళ్లు, న్యాయవాదులు .. స్థానిక ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేయ‌గా చివ‌రికి న్యాయ‌స్థానం అదే తీర్పును వెలువ‌రించింది. గతంలో సంచలనం సృష్టించిన ముస్కాన్ కేసు తరహాలోనే ఈ కేసులోనూ మ‌ర‌ణ శిక్ష ప‌డింది.

బ్లూ డ్ర‌మ్ హ‌త్య కేసులో సంచ‌ల‌న తీర్పు:

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `బ్లూ డ్రమ్`హత్య కేసులో కోర్టు ఇటీవ‌ల‌ సంచలన తీర్పు వెలువరించిన సంగ‌తి తెలిసిందే. మర్చంట్ నేవీ అధికారి అయిన సౌరభ్ రాజ్‌పుత్‌ను అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. భర్తను హతమార్చిన అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఒక నీలిరంగు డ్రమ్ములో కుక్కి.. ఎవరికీ అనుమానం రాకుండా పైన సిమెంట్‌తో సీలు వేసిన ఈ దారుణ ఘటన సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణ జరిపిన మీరట్ జిల్లా కోర్టు, శాస్త్రీయ- ఫోరెన్సిక్ సాక్ష్యాధారాల ఆధారంగా ముస్కాన్, సాహిల్‌లను దోషులుగా నిర్ధారించింది. ఇలాంటి అరాచకమైన నేరాలు సమాజంలో తీవ్ర భయాందోళనలను సృష్టిస్తాయని పేర్కొన్న న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ మిశ్రా, దోషులిద్దరికీ మరణశిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ తీర్పు చెప్పారు. మీరట్‌లో వ‌రుస‌ తీర్పుల‌ ద్వారా అసాఘిక శక్తులకు, నేరస్థులకు చట్టం ముందు కఠినమైన శిక్షలు తప్పవనే బలమైన సందేశం వెలువడిందని ప్ర‌జ‌ల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News