నామినేషన్ల పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు
ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు సందర్భంగా హింస, అడ్డంకులు చోటుచేసుకున్నాయంటూ వచ్చిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లో నామినేషన్ల గడువు పొడిగించాలా వద్దా అనే అంశంపై రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంతేకాకుండా, ఆయా ప్రాంతాల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 25 వరకు ప్రకటించవద్దని స్పష్టం చేసింది.
నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారని, గడువును పొడిగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో నేరుగా జోక్యం చేసుకోవడం తమకు ఇష్టం లేదని ధర్మాసనం పేర్కొంది. అందుకే నామినేషన్ల గడువును పొడిగించాలని తామే నేరుగా ఆదేశాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది.
అయితే, ఎన్నికల ప్రక్రియ కలుషితం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో విశ్వాసం కల్పించడం అత్యంత ముఖ్యమని పేర్కొంది. అవసరమైన సందర్భాల్లో జోక్యం చేసుకోకుండా న్యాయస్థానాల చేతులను కట్టేయలేమని కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదులు అందిన 19 ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.