వైసీపీ అభ్యర్థులకు కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఇవ్వాలి : హైకోర్టులో రెండు పిటిషన్లు

ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో విపక్షం వైసీపీ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది.

Update: 2026-10-13 14:33 GMT

ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో విపక్షం వైసీపీ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికలు సజావుగా సక్రమంగా జరిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ఏ క్షణంలో అయినా ఎన్నికల నగారా మ్రోగుతుందనే ప్రచారం నడుమ విపక్ష పార్టీ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పిటిషన్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అనేది హైకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉందని అంటున్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరడమే కాకుండా, ప్రభుత్వ చేతుల నుంచి ఎన్నికల ప్రక్రియను దూరం చేయాలనే లక్ష్యంతో హైకోర్టును ఆశ్రయించినట్లుగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్ర పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ అధికార ప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికలలో అభ్యర్థులకు భద్రత కల్పించడంతోపాటు పోలింగ్ బూతుల రక్షణకు కేంద్ర బలగాలను నియమించాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో రాష్ట్ర పోలీసుల జోక్యం లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు 24 గంటల పాటు వెబ్ కాస్టింగ్, సీసీ టీవీ నిఘా ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్లను నియమించాలని తన పిటిషన్ లో కోరింది.

నిజానికి స్థానిక ఎన్నికలలో కేంద్ర భద్రతా బలగాలను మోహరించాలని వైసీపీ ఎప్పటి నుంచో కోరుతోంది. గత ఏడాది జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను రాష్ట్ర పోలీసుల సహకారంతో అడ్డుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అప్పట్లోనే స్థానిక ఎన్నికలు జరిగితే కేంద్ర భద్రతా బలగాల ద్వారానే జరగాలని తాము కోరుకుంటున్నట్లు ప్రకటించింది. లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని కూడా హెచ్చరించింది. అయితే ప్రస్తుతం ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు జరగడంతో ముందస్తుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లుగా చెబుతున్నారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ఎన్నికల విషయంలో అడుగులు వేస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో కూటమి శ్రేణులు బలంగా ఉండటం, అధికార బలంతో వైసీపీ కార్యకర్తలను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకునే పరిస్థితి ఉన్నట్లుగా వైసీపీ నేతలు సందేహిస్తున్నారు. దీంతో పల్నాడు వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో నామినేషన్లు వేసేవారికి సైతం భద్రత కల్పించాలని కోరుతూ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మరో పిటిషన్ వేశారని చెబుతున్నారు. కోర్టు ద్వారా తగిన రక్షణ పొంది తమ సత్తా చాటాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని అంటున్నారు.

అయితే వైసీపీ కోరుతున్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర భద్రతా బలగాలను నియమించే అవకాశం ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. ఇప్పటివరకు స్థానిక ఎన్నికల విషయమై రాష్ట్రంలో ఎలాంటి అలజడులు నమోదు కాలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఊహాగానాలు, భయాందోళనలకు కోర్టులు మద్దతు ఇస్తాయా? అనేది చూడాల్సివుందని అంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోను దేశంలో ఇతర చోట్ల స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలను వాడిని ఉదంతాలు లేవని అంటున్నారు. ఇక వైసీపీ అభ్యంతరాలపై హైకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సివుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News