స్థానిక ఎన్నికలపై సుప్రీం సంచలన నిర్ణయం.. ఇటు ప్రభుత్వానికి అటు వైసీపీకి షాక్!
ఏపీలో స్థానిక ఎన్నికలపై నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. స్థానిక ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టులో దాఖలైన రెండు కీలక పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఏపీలో స్థానిక ఎన్నికలపై నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. స్థానిక ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టులో దాఖలైన రెండు కీలక పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయంతో ఇటు ప్రభుత్వానికి అటు విపక్షం వైసీపీకి షాక్ తగిలినట్లైందని అంటున్నారు. ఇదే సమయంలో స్థానిక ఎన్నికలకు అవాంతరాలు తొలగిపోయినట్లైంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏక్షణంలో అయినా స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించడంతో ఈ సాయంత్రం లేదా శనివారం నాడు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
34 శాతం నాట్ ఓకే
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం తిరస్కరించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును సమర్థించింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నందున బీసీ రిజర్వేషన్ల పెంపు అనుమతించలేమని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈ విషయమై ప్రభుత్వం సుప్రీంలో అప్పీలు చేసింది. గత శనివారం పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం ఉదయం కోర్టు ప్రారంభమైన వెంటనే విచారణకు చేపట్టింది. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లైందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ మేరకు కొత్తగా జీవోలు తెచ్చినా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిపోవడంతో కోర్టులు అడ్డుకున్నాయని చెబుతున్నారు.
సర్ పూర్తయ్యే వరకు వెయిటింగ్
మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు అదే సమయంలో విపక్షం వైసీపీకి ఝలక్ ఇచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఇంకా పూర్తికాలేదని, ఈ ప్రక్రియ పూర్తయి కొత్త ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని విపక్షం తరఫున వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, పాకా సురేశ్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు పరిష్కరించింది. నోటిఫికేషన్ కు ముందే సర్ జాబితా విడుదలైతే దాని ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. నోటిఫికేషన్ నాటికి సర్ జాబితా రాకపోతే పాత ఓటర్ల జాబితానే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రక్రియ వాయిదా పడాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు.
ఎన్నికలకు రూట్ క్లియర్
స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నామని చెబుతున్నా, కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీసీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఇలా రకరకాల పిటిషన్లతో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డంకులు ఎదురైనట్లు చెబుతున్నారు. అయితే కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ దిశగా సమాంతరంగా చర్యలు చేపట్టిందని అంటున్నారు. ఇదే సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం వచ్చే నెల 12వ తేదీలోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సివుందని చెబుతున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పులతో వెనువెంటనే ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం అడుగులు వేయనుందని అంటున్నారు.