ఉద్యోగం పేరుతో యుద్దంలో చిక్కి !
ఉద్యోగం పేరుతో వల వేసి రష్యా చేరిన భారతీయులను బలవంతంగా సైన్యంలో చేర్చడంతో యుద్దంలో భాగంగా ఇప్పటి వరకు రష్యన్ సైన్యంలో చేరి మరణించిన భారతీయుల సంఖ్య 51కి చేరింది.
ఉద్యోగం పేరుతో వల వేసి రష్యా చేరిన భారతీయులను బలవంతంగా సైన్యంలో చేర్చడంతో యుద్దంలో భాగంగా ఇప్పటి వరకు రష్యన్ సైన్యంలో చేరి మరణించిన భారతీయుల సంఖ్య 51కి చేరింది. ఈ మేరకు ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించింది. అక్కడ మరణించిన కొందరి భౌతిక ఖాయాలు భారతదేశానికి తీసుకురాగా, మరి కొందరివి అక్కడే ఖననం చేశారు.
2026 అక్టోబర్ 14న సుప్రీంకోర్టులో కేంద్రం ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం దాదాపు 267 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరారు. అందులో 51 మంది మరణించగా, 139 మంది సైన్యం నుండి బయటకు వచ్చారు. 77 మందికి సంబంధించిన సమాచారం లేకపోగా, అందులో ఏడుగురు మిస్సింగ్ అయినట్లు రష్యా అధికారులు నిర్ధారించారు.
2022 ఫిబ్రవరి 24 నుంచి రష్యా, ఉక్రెయిన్ యుద్దం మొదలయింది. 2023-2025 మధ్యకాలంలో సెక్యూరిటీ, హెల్పర్, క్లీనర్, డెలివరీ, లాజిస్టిక్స్ వంటి పనుల పేరుతో యూట్యూబ్, సోషల్ మీడియా, ఏజెంట్ల ద్వారా ఉద్యోగాల పేరుతో ఆకర్షించి రష్యా వెళ్లిన వారిని బలవంతంగా రష్యా సైన్యంలో స్వల్ప కాలిక శిక్షణ ఇచ్చి చేర్చుకున్నారు.
నెలకు రూ.1.50 లక్షల నుండి రూ.2 లక్షల జీతం, సైనిక బోనస్ 5 వేల డాలర్లు, మరణిస్తే పెద్దమొత్తంలో పరిహారం అంటూ ఆశచూపారు. విద్యార్థి, టూరిస్ట్, వర్క్ వీసాలతో రష్యా చేరుకున్న తరువాత పాస్ పోర్టులు తీసుకుని, రష్యన్ భాషలో ఒప్పందాలు చేసుకుని, బలవంతంగా శిక్షణ ఇచ్చి యుద్దభూమికి పంపారు.
ఏజెంట్ల మోసంతో రష్యా చేతిలో చిక్కిన వారు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగేళ్లుగా యుద్దం కొనసాగుతూనే ఉంది. యుద్దం నిలిపివేసేందుకు శాంతిచర్చలు జరుగుతున్నా అందులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. యుద్దంలో ఒకవైపు రష్యా, ఇంకో వైపు ఉక్రెయిన్ పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. స్వాతంత్య్రం, సార్వభౌమత్వం అంటూ ఉక్రెయిన్, ఉక్రెయిన్ నాటోలో చేరడం, రష్యన్ మాట్లాడే ప్రాంతాల రక్షణ పేరుతో రష్యా యుద్దం చేస్తున్నాయి. ఇది ఎప్పుడు ఆగుతుంది ? ఎక్కడికి దారి తీస్తుంది ? అన్నదానికి సమాధానం కనిపించడం లేదు.