అల్లూరి జిల్లాలో వైసీపీ వర్సెస్ జనసేన !
ఏపీలో ఒక సరికొత్త రాజకీయ పోరుకు తెర లేస్తోంది. ఇప్పటిదాకా టీడీపీ వర్సెస్ వైసీపీ గానే రాజకీయం ఉంటూ వచ్చింది.
ఏపీలో ఒక సరికొత్త రాజకీయ పోరుకు తెర లేస్తోంది. ఇప్పటిదాకా టీడీపీ వర్సెస్ వైసీపీ గానే రాజకీయం ఉంటూ వచ్చింది. కానీ తొలిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైసీపీ వర్సెస్ జనసేనల మధ్య రాజకీయ సమరం సాగనుంది అని అంటున్నారు. గిరిజన ప్రాంతాల మీద జనసేన మొదటి నుంచి మక్కువ చూపిస్తోంది. జనసేన అధినేత పవన్ కూడా అనేక సార్లు అల్లూరి జిల్లాలో పర్యటించి అరకు, పాడేరులలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అక్కడ రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో పాటు వైసీపీ ఆధీనంలో ఉన్న రాజకీయ సీట్లను తమ వైపే తిప్పుకోవాలని జనసేన పంతం మీద ఉంది. అలా తన పార్టీని విస్తరించుకుంటే కూటమికి కూడా ఇబ్బంది ఉండదని భావిస్తోంది. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ పీఠం మీద జనసేన ముందే కర్చీఫ్ వేసింది. దానికి టీడీపీ కూడా అంగీకరించడంతో ఇప్పుడు జిల్లా పరిషత్ రాజకీయం రసకందాయంలో పడింది.
నాగబాబు వ్యాఖ్యలతో :
అల్లూరి జిల్లాకు జనసేన తరఫున పరిశీలకులుగా ఎమ్మెల్సీ నాగబాబు వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ మధ్యనే ఆ జిల్లా పర్యటనలో మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో మెజారిటీ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. దానికి తగినట్లుగా అల్లూరి జిల్లాలో జనసేన ఎక్కువ జెడ్పీటీసీలకు పోటీ చేస్తోంది అని అంటున్నారు. జనసేన పార్టీ 9 జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించి నామినేషన్లు దాఖలు చేసింది. కూటమిలోని టీడీపీ, బీజేపీ కూడా పోటీలో ఉన్నాయి. అయితే జనసేన నుంచే జెడ్పీ చైర్మన్ ఇస్తారు అని ప్రచారంలో ఉంది. దానికి తగినట్లుగా ఆ పార్టీ రంగంలోకి దిగిపోయింది.
వైసీపీకి హాట్ ఫేవరేట్ :
ఇదిలా ఉంటే అల్లూరి జిల్లా వైసీపీకి హాట్ ఫేవరేట్ జిల్లా అన్నది తెలిసిందే. 2024 లో కూటమి ప్రభంజనంలో అన్ని చోట్ల ఓటమి చెందినా అరకు ఎంపీతో పాటు పాడేరు, అరకు ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి దక్కాయి. ఇక మొత్తం 11 మండలాల్లో జెడ్పీటీసీలకు వైసీపీ పోటీ చేస్తోంది. ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఓటు బ్యాంక్ పరంగా వైసీపీ బలంగా ఉంది అని అంటున్నారు. ఇక వైసీపీకి ఎంత నమ్మకం అంటే తమ పార్టీ తరఫున కొయ్యూరు మండలం నుంచి మాజీ ఎంపీ గొడ్డేటి మాధవిని జెడ్పీటీసీగా పోటీ చేయిస్తోంది. ఎంపీ చేసిన ఆమెను బరిలోకి దించడానికి కారణం జెడ్పీ చైర్మన్ పీఠం అప్పగించే ఆలోచన ఉందని అంటున్నారు. అయితే ఇదే పదవి కోసం మాజీ చైర్ పర్సన్ సుభద్ర కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కూడా జెడ్పీటీసీగా పోటీలో ఉన్నారు. అలాగే పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు సతీమణి కూడా జెడ్పీ చైర్మన్ రేసులో ఉంటూ జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు.
టఫ్ ఫైట్ అయినా :
నిజానికి అల్లూరి జిల్లాలో వైసీపీని ఓడించడం కష్టమని విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీకి గ్రౌండ్ లెవెల్ లో బలం గట్టిగా ఉంది. కానీ జనసేన కూడా ఇటీవల కాలంలో జనాలకు చేరువ అవుతూ వస్తోంది. ఆ పార్టీలో కూడా కొంతమంది వైసీపీ నేతలు చేరారు. అదే విధంగా పవన్ చరిష్మా కూడా పనిచేస్తుంది అని జనసేన భావిస్తోంది. ఇక టీడీపీకి కూడా బలం ఉంది, బీజేపీకి కొన్ని చోట్ల పట్టు ఉంది. ఇలా కూటమిగా కలసి వస్తే అల్లూరి జెడ్పీ పీఠం తమది అవుతుంది అని జనసేన లెక్క వేసుకుంటోంది. చూడాలి మరి వైసీపీ హాట్ ఫేవరేట్ జిల్లాను కనుక జనసేన సాధిస్తే ఇక ఆ పార్టీకి తిరుగు ఉండదనే అంటున్నారు.