అనకాపల్లి జెడ్పీ పీఠం...బీజేపీ వర్సెస్ జనసేన !

అనకాపల్లి లో మొత్తం, 24 మండలాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ నుంచి విడిపోయి తొలిసారి జిల్లా పరిషత్తుగా రూపు దిద్దుకుంది.

Update: 2026-10-28 03:38 GMT

అనకాపల్లి లో మొత్తం, 24 మండలాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ నుంచి విడిపోయి తొలిసారి జిల్లా పరిషత్తుగా రూపు దిద్దుకుంది. ఈ జెడ్పీ పీఠం మీద తొలి చైర్మన్ ఎవరు కావాలి అన్నదే కూటమి పార్టీల మధ్య చర్చ సాగుతోంది. జడ్పీ పీఠాన్ని టీడీపీ అయితే మిత్రులకు వదిలేసి తాను విశాఖ జిల్లా జెడ్పీ పీఠాన్ని తీసుకుంటుందని చర్చ సాగుతోంది. దాంతో ఇక్కడ జనసేన వర్సెస్ బీజేపీల మధ్యనే ఈ పీఠం కోసం పోటీ సాగుతోంది అని అంటున్నారు. దానికి కారణం ఉంది. అనకాపల్లి ఎమ్మెల్యే జనసేనకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ అయితే అనకాపల్లి ఎంపీగా బీజేపీకి చెందిన సీఎం రమేష్ ఉన్నారు. దాంతో ఆయన తన పట్టుని కొనసాగించడానికి జెడ్పీ పీఠం బీజేపీకి కావాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని అంటున్నారు.

జనసేనకు రెండు :

ఇక ఉత్తరాంధ్రాలో ఆరు జడ్పీ పీఠాలు ఉంటే రెండు తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది. అందులో ఒకటి అల్లూరి జిల్లా అయితే రెండవది అనకాపల్లి కావాలని ఆ పార్టీ అడుగుతోంది. అలా కాకపోతే శ్రీకాకుళం అయినా ఇవ్వాలని అంటోంది. ఎందుకంటే విజయనగరం, విశాఖ జెడ్పీలతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా జెడ్పీ టీడీపీ తీసుకుంది. శ్రీకాకుళం జనసేనకు ఇవ్వాలనుకున్నా మేయర్ సీటు ఇప్పటికే ఆ పార్టీకి ఇచ్చారు. జెడ్పీ కూడా అదే పార్టీకి ఇస్తే మొత్తం జిల్లా అంతా ఆ పార్టీకే ఇచ్చినట్లు అవుతుందని తమ్ముళ్ళు అభ్యంతరం చెబుతున్నారు. ఇక జనసేనకు కూడా తామకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న అనకాపల్లి జిల్లాలోనే జెడ్పీ ఇస్తే బెటర్ అని కోరుకుంటోంది. దానికి టీడీపీ సుముఖంగ ఉంది అని వార్తలు వచ్చాయి.

బీజేపీ ఎందుకంటే :

బీజేపీ కూడా అనకాపల్లి జిల్లాలో బలపడాలని చూస్తోంది. అయితే ఆ పార్టీకి జిల్లాలో ఎలమంచిలి మునిసిపాలిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇపుడు జెడ్పీ చైర్మన్ కూడా ఎలా ఇస్తారు అని అంటున్నారు. కానీ సీఎం రమేష్ ఎంపీగా తన రాజకీయ పరపతి ఉపయోగించి బీజేపీకి జెడ్పీ చైర్మన్ పీఠం తీసుకుని వస్తారని కమలనాధులు ఆశపడుతున్నారు. ఇక అనకాపల్లిలో చూస్తే కూటమిలో ఏ పార్టీ ఎన్నెన్ని జడ్పీటీసీలకి పోటీ చేస్తోంది అంటే టీడీపీ 15, జనసేన 5, బీజేపీ 4గా ఉంది. ఈ మేరకు కూటమి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. కూటమి ఒప్పందంలో భాగంగా అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారంగా ఉంది కానీ బీజేపీ ముందుకు రావడమే విశేషం.

టీడీపీలో కూడా :

ఇక టీడీపీ నేతలు కూడా తమకు జెడ్పీ చైర్మన్ పదవి కావాలని కోరుతున్నారు. టీడీపీకి చెందిన మాజీ జెడ్పీ చైర్మన్ లాలం భవానీ కూడా జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. ఆమె ఈ పదవి కోరుకుంటున్నారు. పొత్తులో ఎలమంచిలి ఎమ్మెల్యే టికెట్ తమకు దక్కలేదని ఆమె వర్గం ఆవేదనగా ఉంది. పైగా ఉమ్మడి విశాఖలో జెడ్పీ చైర్మన్ గా అయిదేళ్ల పాటు చక్కగా పాలించారు అని ఆమెకు పేరు ఉంది. 15 జెడ్పీటీసీలకు పోటీ పడుతూ తాము ఎందుకు జెడ్పీ పీఠం తీసుకోకూడదని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతనే జెడ్పీ చైర్మన్ ఎవరు అన్నది నిర్ణయిస్తారు అంటున్నారు. ఇక చూస్తే వైసీపీ కూడా గట్టిగానే పోటీ ఇస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News